వైసీపీలో ఇంట్రెస్టింగ్ సీన్‌.. 'రెడ్డి' సైలెంట్.. 'కాపు' వైలెంట్‌!

admin
Published by Admin — May 19, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన, అత్యంత ఆసక్తికరమైన సమీకరణం కనిపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊహించని పరాజయాన్ని చవిచూసిన తర్వాత ఆ పార్టీ అంతర్గత రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. నిన్నటివరకు పార్టీని, ప్రభుత్వాన్ని తమ చేతుల్లో పెట్టుకుని శాసించిన ఒక సామాజికవర్గం ఇప్పుడు పూర్తిగా తెరమరుగైపోగా.. నాడు ప్రాధాన్యం కోసం ఎదురుచూసిన మరో వర్గం ఇప్పుడు పార్టీకి రక్షణ కవచంగా నిలుస్తోంది. సంక్షోభ సమయంలో వైసీపీలో కనిపిస్తున్న ఈ సరికొత్త సీన్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఐదేళ్ల వైసీపీ(YCP) పాలనలో సర్వాధికారాలు చెలాయించిన కొందరు కీలక రెడ్డి సామాజికవర్గ నేతలు ఇప్పుడు పార్టీ శ్రేణులకు కూడా అందుబాటులో లేకుండా పోయారు. నాడు ప్రభుత్వంలో సకల శాఖల నిర్ణయాల్లోనూ వేలు పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకొని, తిరుమల వేదికగా రాజకీయం నడిపిన వైవీ సుబ్బారెడ్డి వరకు అందరూ ఇప్పుడు సైలెన్స్ మోడ్‌లోకి వెళ్లిపోయారు.

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు నాడు జగన్ కోటరీలో నంబర్ వన్ స్థానాల కోసం పోటీ పడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy), మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి నేతలు ఇప్పుడు అధినేత పిలుపునిస్తున్న నిరసనల్లో కానీ, ప్రెస్ మీట్లలో కానీ చురుగ్గా కనిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు, సొంత ఇలాకాల్లో గొడవలు జరుగుతున్నా సరే.. నాడు తామే కింగ్స్ అని ప్రచారం చేసుకున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి, వెంకట్రామిరెడ్డి వంటి వారు కనీసం మీడియా ముందుకు వచ్చి మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించడం లేదు. సొంత చిన్నాన్న వివేకా హత్య కేసు ఆరోపణలతో అవినాష్ రెడ్డి కూడా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, కష్టం రాగానే పక్కకు తప్పుకున్నారనే విమర్శ వీరిపై బలంగా వినిపిస్తోంది.

రెడ్డి నేతలంతా సైలెంట్ అయిపోయిన వేళ.. విపక్షాల దాడి నుంచి జగన్‌ను, వైసీపీని కాపాడే బాధ్యతను కాపు సామాజికవర్గ నేతలు భుజానకెత్తుకున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం మాట్లాడటానికే పరిమితమైన పేర్ని నాని, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana), గుడివాడ అమర్నాథ్ వంటి నేతలే ఇప్పుడు నిత్యం మీడియా ముందుకొచ్చి కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. అమరావతి రాజధాని ఇష్యూ నుంచి మొదలుకొని తాజా రాజకీయ పరిణామాల వరకు ప్రతి అంశంలోనూ జగన్ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు వీరే ప్రయత్నిస్తున్నారు. వీరితో పాటు జోగి రమేష్, విడదల రజని వంటి బీసీ నేతలు కూడా అరకొరగా కనిపిస్తున్నప్పటికీ, మెజారిటీ పోరాటమంతా కాపు నేతల చుట్టూనే తిరుగుతోంది. ప్రత్యర్థుల నుంచి వస్తున్న విమర్శలను ఎదుర్కొంటూ, కేసులకు భయపడకుండా పార్టీ లైన్‌ను కాపాడుతోంది వీరే కావడం గమనార్హం.

కాగా, ప్రస్తుతం వైసీపీ క్యాడర్‌లో ఒకటే చర్చ నడుస్తోంది. కష్టకాలంలో పార్టీని కాపాడుతూ, వైలెంట్‌గా పోరాడుతున్న కాపు నేతలకు భవిష్యత్తులో సరైన గుర్తింపు దక్కుతుందా? లేక రేపు జగన్(Jagan) 2.0 అధికారంలోకి రాగానే మళ్లీ పాత రెడ్డి కోటరీ వచ్చి పీఠాలపై కూర్చుంటుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags
YSRCP Jagan Mohan Reddy AP Politics Andhra Pradesh YS Jagan
Recent Comments
Leave a Comment

Related News