టాలీవుడ్ లవ్లీ కపుల్ మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి(Bhuma Mounika Reddy) త్వరలోనే సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు. గత కొంతకాలంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటున్న ఈ జంట.. ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తాజాగా తన పుట్టినరోజు (మే 20) సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన మంచు మనోజ్, కీలక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల బరిలో తన భార్య మౌనిక రెడ్డి నిలబడబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
తమ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. తాము ప్రస్తుతం పాలిటిక్స్‌లో భాగమయ్యామని మనోజ్ ప్రకటించారు. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి వారసురాలిగా మౌనిక రెడ్డికి రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంది. ఈ క్రమంలోనే ఆమె ఎన్నికల బరిలోకి దిగుతుండటం ఇప్పుడు అటు నంద్యాల జిల్లాలోనే కాకుండా, ఇటు టాలీవుడ్(Tollywood)లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఏ పార్టీయో చెప్పడానికి మనోజ్ నిరాకరించారు. తాము ప్రజల పార్టీ అని.. ప్రజల పక్షాన నిలబడాతమని పేర్కొన్నారు.
ఇకపోతే ఇటీవలే మంచు మనోజ్ 'ఐఖ్య' అనే సరికొత్త సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇది మౌనిక పొలిటికల్ ఎంట్రీ కోసమే పెట్టిన పార్టీ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. దీనిపై మనోజ్ క్లారిటీ ఇస్తూ.. "ఐక్య అనేది ఎలాంటి రాజకీయ సంస్థ కాదు. సమాజంలో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల గొంతుకగా నిలబడటానికి, వారికి ధైర్యం ఇవ్వడానికి పుట్టిందే ఈ ధైర్య సేన. దీనికి రాజకీయాలతో అస్సలు సంబంధం లేదు" అని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఈ సంస్థ కోసం ఎవరి దగ్గరా విరాళాలు తీసుకోనని, తన సొంత నిధులను మాత్రమే ఖర్చు చేస్తానని మనోజ్(Manchu Manooj) చెప్పుకొచ్చారు.
ప్రెస్‌మీట్‌లో మౌనిక రాజకీయ ఎంట్రీ ఎంత హైలైట్ అయిందో.. తండ్రి మోహన్ బాబు ప్రస్తావన వచ్చినప్పుడు మనోజ్ ఇచ్చిన కౌంటర్ అంతకంటే పెద్ద హైలైట్ అయింది. మోహన్ బాబు(Mohan Babu)తో ఉన్న గొడవలు సర్దుమణిగాయా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. మనోజ్ తనదైన స్టైల్లో నవ్వుతూ చమత్కరించారు. "ఆ ప్రశ్న నన్ను కాదు.. ఎవరిని అడగాలో ఆయననే అడగండి. కానీ ఒక చిన్న సలహా.. మైక్ పట్టుకుని ఆయన దగ్గరికి వెళ్లేటప్పుడు మాత్రం కచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి" అంటూ సెటైర్ వేయడంతో అక్కడున్న వారంతా నవ్వేశారు. మొత్తానికి భార్య మౌనిక రెడ్డిని ఎన్నికల బరిలో నిలబెడుతూ.. తాను మాత్రం ప్రజాసేవకుడిగా ‘ఐఖ్య’ ద్వారా ముందుకు సాగుతానని మనోజ్ స్పష్టం చేశారు.