సాధారణంగా పెళ్లిళ్లలోనే కాదు.. ఏదైనా పండుగలు, ప్రత్యేక రోజులు వస్తే అల్లుళ్లకు అత్తగారి ఇళ్ల నుంచి వచ్చే మర్యాదలే వేరుగా ఉంటాయి. కొత్త బట్టలు పెట్టడం, బంగారు ఉంగరాలు గిఫ్ట్‌గా ఇవ్వడం చూస్తుంటాం. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వందల రకాల వంటకాలతో అల్లుడి కడుపు నింపే దాకా అత్తమ్మలకు నిద్రపట్టదు. కానీ, మహారాష్ట్ర(Maharashtra)కు చెందిన ఓ అత్తమామలు మాత్రం తమ అల్లుడికి ఇచ్చిన గిఫ్ట్ చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ట్రెడిషన్‌కు కాస్త లగ్జరీని అద్దిన ఆ అత్తగారు.. ఏకంగా వెండి చెప్పులు చేయించి అల్లుడికి కానుకగా ఇచ్చారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన ఓ కుటుంబం తమ అల్లుడి కోసం ఈ వినూత్నమైన సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. హిందూ క్యాలెండర్ ప్రకారం వచ్చే అధిక మాసం సందర్భంగా అల్లుళ్లకు ప్రత్యేక బహుమతులు ఇవ్వడం అక్కడి కొన్ని ప్రాంతాల్లో చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఎప్పుడూ ఇచ్చే రొటీన్ గిఫ్ట్స్ కాకుండా, కొల్హాపూరి(kolhapuri) సంస్కృతి ఉట్టిపడేలా ఏదైనా వెరైటీగా ఇవ్వాలనుకున్నారు ఆ అత్తమామలు. ఇంకేముంది.. ప్రపంచ ప్రఖ్యాత కొల్హాపూరి చప్పల్స్ డిజైన్‌ను ఏకంగా వెండితో తయారు చేయించి అల్లుడి చేతిలో పెట్టారు.
ప్రతిభానగర్‌కు చెందిన ప్రముఖ వెండి కళాకారుడు విక్రాంత్ మాలి ఈ అద్భుతమైన చెప్పులను రూపొందించారు. ఓ నగల వ్యాపారి ఇచ్చిన ఆర్డర్ మేరకు, అసలైన తోలు చెప్పుల డిజైన్‌ను క్షుణ్ణంగా స్టడీ చేసి వీటిని తయారు చేశారు. గత 20 ఏళ్లుగా వెండితో ఎన్నో వింత వస్తువులు తయారు చేసిన విక్రాంత్‌కు కూడా వెండితో చెప్పులు(Silver Slippers) చేయడం ఇదే తొలిసారి. దాదాపు 95 శాతం స్వచ్ఛమైన, 1.5 కిలోల వెండితో, తొమ్మిది రోజుల పాటు శ్రమించి వీటిని సిద్ధం చేశారు. ఇవి విరిగిపోకుండా ఉండేందుకు కొద్దిగా క్యాడ్మియం కూడా కలిపారు. అంటే, వీటిని కేవలం షోకేస్‌లోనే పెట్టుకోవడం కాదు.. హ్యాపీగా కాళ్లకు వేసుకుని నడవచ్చన్నమాట!
ఇక ఈ వెండి చెప్పుల రేటు విషయానికొస్తే ఎవరికైనా ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ బ్రాండ్ ‘ప్రాడా’ (Prada) అమ్మే కొల్హాపూరి చెప్పుల ధర దాదాపు రూ. 84 వేలు ఉంటుంది. కానీ, ఈ అత్తమామలు కేవలం చెప్పుల తయారీ కూలి కోసమే ఆర్టిస్ట్‌కు రూ. 22 వేలు చెల్లించారు. మొత్తం వెండి, మేకింగ్ ఛార్జీలు అన్నీ కలుపుకుని ఈ గిఫ్ట్ కోసం ఏకంగా రూ. 4.25 లక్షలు ఖర్చు చేశారు. ఈ లగ్జరీ కానుకకు సంబంధించిన ముచ్చట్లు, ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.