కర్నూలు(Karnool) రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. రాయలసీమ రాజకీయాల్లో తనదైన శైలితో దూసుకుపోయే వైసీపీ(YCP) యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఇప్పుడు కాకలు రేపే వివాదం ముసురుకుంది. మే 14న కర్నూలు కలెక్టరేట్ సాక్షిగా జరిగిన వైసీపీ ధర్నా.. ఇప్పుడు బైరెడ్డికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ ను టార్గెట్ చేస్తూ బైరెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కేలా చేశాయి.
కలెక్టరేట్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మైక్ పట్టుకుని మంత్రి టీజీ భరత్(T. G. Bharath)పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే, ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా.. తన వ్యక్తిగత పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని, ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించేలా బైరెడ్డి మాట్లాడారని మంత్రి భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆయన నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయగా, కర్నూలు త్రీ టౌన్ పోలీసులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని సీఐ శేషయ్య అధికారికంగా ధృవీకరించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం, ఫిర్యాదు చేసింది సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి కావడంతో.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి(Byreddy Siddharth Reddy)పై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఒకవేళ పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారా? లేదా నేరుగా అరెస్ట్ వారెంట్ జారీ చేస్తారా? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.