జగన్ పై అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. జగన్ ఒక నటుడు, క్రిమినల్ అని, ఇప్పుడు హఠాత్తుగా శాంతిదూత ముసుగు వేసుకుని ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పైనున్న నేరస్తుడు అనే ముద్ర నుంచి తప్పించుకోవడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు.
వైఎస్ కుటుంబం పులివెందులలో అరాచక సామ్రాజ్యాన్ని నిర్మించిందని ఆరోపించారు. జగన్ తాత రాజారెడ్డిపై రౌడీ షీట్ నమోదైందని, ఒక కులాన్ని అడ్డం పెట్టుకుని దొంగతనాలు చేయించడం, మైనింగ్ యజమానిని హత్య చేసి గనులు అక్రమంగా చేజిక్కించుకోవడం వంటి చర్యలతో డబ్బు కూడగట్టారని అన్నారు. పార్నపల్లి గ్రామంలో ఇప్పటికీ ఆ అరాచకాలకు సాక్ష్యాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
జగన్ తన రాజకీయ లబ్ధి కోసం తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మరణాలను వేర్వేరుగా వాడుకుంటున్నారని రమేష్ ఆరోపించారు. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి విషయంలో జగన్ పాత్రపై రాష్ట్రవ్యాప్తంగా ఓపెన్ పోల్ నిర్వహించాలని సవాల్ విసిరారు. ఆ పోల్‌లో జగన్ కు సంబంధం లేదని తేలితే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. ప్రజలు జగన్ హత్యా రాజకీయాలను అర్థం చేసుకున్నారని, అందుకే ఓటమి తర్వాత మంచివాడినని నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.