ఆ కారణంతోనే వెనక్కి తగ్గానంటున్న ప్రొఫెసర్ నాగేశ్వర్

admin
Published by Admin — May 24, 2026 in Andhra
News Image

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల మీద చక్కటి విశ్లేషణ చేసే అనలిస్టుల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకరు. గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవానికి తోడు, ఎన్నో ఏళ్లుగా రాజకీయాల మీద పరిశోధన, పరిశీలన చేస్తూ వచ్చిన ఎక్స్‌పీరియెన్స్‌తో ఆయన పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్నారు. కానీ అప్పుడప్పుడూ నాగేశ్వర్ చేసే విశ్లేషణలు ఆయన మీద వైసీపీ అనుకూలుడిగా ఒక ముద్రను వేశాయి.

తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన నాదెండ్ల మనోహర్‌ల గురించి చేసిన వ్యాఖ్యలతో నాగేశ్వర్ మీద తీవ్ర విమర్శలు వచ్చాయి. పవన్, మనోహర్ ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి అక్రమాస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అడిగితే.. అందుకు నిరాకరిస్తూ జగన్ తమకు నమ్మకమైన శాశ్వత మిత్రుడని, చంద్రబాబులా తాత్కాలిక మిత్రుడు కాదని అమిత్ షా చెప్పినట్లు నాగేశ్వర్ వ్యాఖ్యానించారు. దీన్ని వైసీపీ వాళ్లు జగన్‌‌కు ఎలివేషన్‌గా మార్చుకోవడమే కాక.. జనసేనను విమర్శించడానికి దీన్నొక ఆయుధంగా వాడుకున్నారు.

దీంతో జనసేన, తెలుగుదేశం పార్టీల మద్దతుదారులు నాగేశ్వర్ మీద విరుచుకుపడ్డారు. జగన్ గురించి అమిత్ షా ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారంటే ఎవరు నమ్ముతారని, ఫేక్ న్యూస్‌లు ప్రచారం చేస్తూ వైసీపీకి లాభం చేకూర్చడానికే నాగేశ్వర్ ఇలా మాట్లాడారని ఆయనపై మండిపడ్డారు. ఈ విషయమై నాగేశ్వర్ మీద పోలీసు కేసులు కూడా నమోదు కావడం గమనార్హం. ఐతే జనసేన నుంచి వచ్చిన స్పందన చూశాక నాగేశ్వర్ వెనక్కి తగ్గారు. 

నాదెండ్ల మనోహర్ సైతం ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఈ కామెంట్లను వెనక్కి తీసుకోవాలని సూచించారు. దీంతో నాగేశ్వర్ వెనక్కి తగ్గారు. నాదెండ్ల మనోహర్ కోరినట్లు తాను.. పవన్, మనోహర్‌ల మీద చేసిన వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. తనకు ఈ సమాచారం ఇచ్చిన మిత్రుడిది తప్పు ఉండొచ్చని భావిస్తున్నానని.. ఇలా ఏదైనా కామెంట్ చేసి, కరెక్ట్ చేసుకోవడం, వెనక్కి తీసుకోవడంలో సిగ్గుపడాల్సిందేమీ లేదని ఆయనన్నారు.

అంతే కాక పవన్‌ను గతంలో తన కొడుకు పెళ్లి కోసం పిలవడానికి అపాయింట్మెట్ కోరితే, మీరు నాకు నేరుగా వచ్చి కార్డు ఇవ్వాల్సిన పని లేదని, ఫోన్లో పిలిచినా వస్తానని చెప్పిన పవన్ అన్న ప్రకారమే నేరుగా వెళ్లి పిలవకపోయినా పెళ్లికి వచ్చారని నాగేశ్వర్ గుర్తు చేసుకున్నారు. అంతేకాక తాను ఒక సందర్భంలో పవన్‌ను ఇంటర్వ్యూ చేయాలని అడిగితే, ఆయన స్పందించిన తీరు కూడా తనకెంతో నచ్చిందని, ఇలా రకరకాల కారణాలతో ఆయన మీద తనకు ఎంతో గౌరవం ఉందని.. అందుకే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంలో తనకేమీ భేషజం లేదని నాగేశ్వర్ స్పష్టం చేశారు.

Tags
Professor nageswar janasena took his comments back
Recent Comments
Leave a Comment

Related News