ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లూ పెద్దల సభ పైనే ఉన్నాయి. జూన్ 1న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో అమరావతి వేదికగా పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం కేవలం 18 రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు స్థానాలను దక్కించుకునేందుకు కూటమి నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సంఖ్యాబలం పరంగా ఈ నాలుగు సీట్లు అధికార కూటమికే దక్కడం నల్లేరుపై నడకే అయినప్పటికీ, ఆ సీట్లలో కూర్చునే ఆ నలుగురు ఎవరనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
మహానాడు వేదికగా తమ్ముళ్ల కోలాహలం ఒకవైపు కనిపిస్తుంటే, మరోవైపు రాజ్యసభ టికెట్ల కోసం చంద్రబాబు(Chandrababu), లోకేష్‌ల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు ఊపందుకున్నాయి. పార్టీ కోసం దశాబ్దాలుగా పనిచేసిన ఒక మాజీ మంత్రి, అలాగే గతంలో ఎంపీగా సేవలందించిన ఒక సీనియర్ నేత ఈసారి ఎలాగైనా ఢిల్లీకి వెళ్లాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. రోజురోజుకూ క్యూ కడుతున్న అభ్యర్థుల లిస్ట్ చూస్తుంటే బాబు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే ఉత్కంఠ రేపుతోంది. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. చంద్రబాబు ఇప్పటికే ఎవరిని పంపాలో ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారని, కేవలం అధికారిక ప్రకటన మాత్రమే బాకీ ఉందనే ప్రచారం జోరందుకుంది.
మరోవైపు ఈ నాలుగు స్థానాల పంపకం కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య ఆసక్తికర చర్చకు దారితీసింది. తమకు ఒక రాజ్యసభ స్థానం కేటాయించాలని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నేతృత్వంలోని జనసేన మొదటి నుంచీ పట్టుబడుతుండగా, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పేందుకు ఏపీ నుంచి మరో సీటు కావాలని కమలనాథులు కూడా గట్టిగానే ఆశిస్తున్నారు. అయితే, ఈ విడత బీజేపీకి స్థానం ఇచ్చే ప్రసక్తే లేదని చంద్రబాబు తేల్చిచెప్పినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ఒక టాక్ నడుస్తోంది. మరి వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందా? లేదా మిత్రధర్మాన్ని పాటించి జనసేనకు సీటు కేటాయించి, మిగిలినవి టీడీపీ ఉంచుకుంటుందా? అన్నది చూడాలి. మరో మూడు రోజుల్లో నోటిఫికేషన్ రానుండటంతో, ఈ సస్పెన్స్‌కు తెరపడటం ఖాయం. బాబు మార్క్ పాలిటిక్స్‌లో ఎవరికి అదృష్టం వరిస్తుందో చూడాలి!