విడుదల ముందు `పెద్ది`కి రేవంత్ స‌ర్కార్ బిగ్ షాక్‌..!

admin
Published by Admin — May 30, 2026 in Movies
News Image

మెగా పవ‌ర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఈ మూవీ రిలీజ్‌కు ముందే ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ భారీ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. అయితే, సినిమా విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న వేళ, తెలంగాణలో ఈ చిత్ర యూనిట్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

సాధారణంగా ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలకు మొదటి వారం కలెక్షన్లు అత్యంత కీలకం. అందుకే ‘పెద్ది(Peddi)’ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ చిత్ర నిర్మాణ సంస్థ తెలంగాణ ప్రభుత్వ హోం సెక్రటరీకి ముందే దరఖాస్తు చేసుకుంది. అయితే, రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి ఈ టికెట్ల పెంపు ప్రతిపాదనకు ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో టెన్షన్ పడిన మైత్రీ మూవీ మేకర్స్.. చివరి నిమిషంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

కోర్టులోనైనా ఊరట లభిస్తుందని ఆశించిన చిత్ర బృందానికి అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఈ వ్యవహారంపై అత్యవసర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు(High Court) నిరాకరించింది. టికెట్ల ధరల నియంత్రణ విషయంలో ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. సినిమా జూన్ 4నే విడుదలవుతుంటే, జూన్ 6న విచారణ జరగడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని గ్రహించిన చిత్ర యూనిట్.. చేసేదేమీ లేక తమ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

చిత్రం ఏమిటంటే.. ఇటు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో మాత్రం పెద్ది చిత్రానికి ప్రత్యేక ప్రదర్శనలతో పాటు, టికెట్ ధరల పెంపునకు అక్కడి ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులు లభించాయి. ఏపీలో భారీ హైప్‌తో బిజినెస్ జరుగుతుంటే, తెలంగాణలో మాత్రం పాత ధరలకే సినిమాను ప్రదర్శించాల్సి రావడం రేవంత్ సర్కార్ ఇచ్చిన బిగ్ షాక్ అనే చెప్పాలి. మరి ఈ టికెట్ ధరల ప్రభావం తెలంగాణ బాక్సాఫీస్ కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Tags
Peddi Ram Charan Peddi Movie Buchi Babu Sana Janhvi Kapoor Mythri Movie Makers Tollywood
Previous News Next News
Recent Comments
Leave a Comment

Related News