అమెరికాలో విషాదం.. ఫ్రెండ్స్ కోసం హైద‌రాబాద్ కుర్రాడు మృతి!

admin
Published by Admin — May 31, 2026 in Telangana, International
News Image

అమెరికా(America)లో ఉన్నత చదువులు చదువుకుని, కన్నవారికి అండగా నిలవాలనుకున్న ఒక తెలుగు విద్యార్థి కథ విషాదాంతమైంది. రిజర్వాయర్‌లో ప‌డిపోయిన స్నేహితుల ప్రాణాలు కాపాడే క్రమంలో ఆ యువకుడు కన్నుమూశాడు. లూసియానాలో జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానిక తెలుగు కమ్యూనిటీతో పాటు తెలంగాణలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మృతుడిని తెలంగాణలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన అనురూప్ రెడ్డి కొడూరుగా గుర్తించారు. ఆయన కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లోని కవాడిగూడలో నివసిస్తోంది. అమెరికాలోని యూఎన్‌టీ (UNT) యూనివర్సిటీలో ఇటీవలే మాస్టర్స్ పూర్తి చేసిన అనురూప్, డిగ్రీ చేతికి వచ్చిన కేవలం ఆరు రోజులకే ఇలా అనంత లోకాలకు వెళ్లిపోతాడని ఎవరూ ఊహించలేదు.

ప్రమాద సమయంలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న తన స్నేహితులను చూసి అనురూప్(Anuroop Reddy) అస్సలు వెనకడుగు వేయలేదు. ప్రాణాలకు తెగించి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాడు. అయితే, దురదృష్టవశాత్తూ నీటిలో ఉన్న ఒక చేపల వేట వల అనురూప్ కాలికి గట్టిగా చుట్టుకుపోయింది. దాని నుంచి తప్పించుకోలేక పోవడంతో అతడు నీట మునిగిపోయాడు. స్థానిక రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి దాదాపు 20 అడుగుల లోతు నుంచి అనురూప్ మృతదేహాన్ని వెలికితీసింది.

అమెరికాలో అనురూప్ పడిన కష్టం అందరినీ కన్నీరు పెట్టిస్తోంది. ఎన్నో కలలతో మాస్టర్స్ పూర్తి చేసిన కొడుకు, ఉద్యోగంలో స్థిరపడతాడనుకున్న సమయంలో ఈ వార్త వినాల్సి రావడంతో హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ప్రస్తుతం అనురూప్ రెడ్డి భౌతికకాయాన్ని భారతదేశానికి తీసుకువచ్చేందుకు స్నేహితులు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కోసం 'గోఫండ్‌మీ' (GoFundMe) ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు.

Tags
US Telugu Student Hyderabad Telangana USA News Anuroop Reddy America
Recent Comments
Leave a Comment

Related News