రాజకీయాల్లో మాట జారితే ఎంతటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో తాజాగా తెలుగుదేశం పార్టీలో జరిగిన ఒక పరిణామం నిరూపించింది. మహానాడు వేదికగా సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత బక్కని నర్సింహులు(Bakkani Narasimhulu) చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీని ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడేశాయి. "తెలంగాణ అనే పదమే డిక్షనరీలో లేదు.. అది కొందరు ప్రాంతీయవాదులు సృష్టించింది" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీయడంతో, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తక్షణమే రంగంలోకి దిగారు. సొంత పార్టీ నేతపైనే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
బక్కని నర్సింహులు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన చంద్రబాబు(Chandrababu).. అసలు తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఉందో లేదో ఆయన చూశారా? అని ప్రశ్నించారు. ప్రాంతాలు వేరైనప్పటికీ తెలుగువారంతా ఒక్కటేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ సమాజాన్ని గానీ, అక్కడి ప్రజల సెంటిమెంట్‌ను గానీ అవమానించేలా మాట్లాడితే సహించేది లేదని స్పష్టం చేశారు. ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యల వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, రాజకీయాల కోసం సెంటిమెంట్లతో ఆటలాడటం సరికాదని హితవు పలికారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి, తెలంగాణ(Telangana)కు ఉన్న అవినాభావ సంబంధాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. "1982లో స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు టీడీపీని ప్రకటించినప్పుడు ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నారు. అంటే ఈ పార్టీ పురుడుపోసుకుందే తెలంగాణ గడ్డపై" అని బాబు నొక్కిచెప్పారు. తెలంగాణ ప్రజల విముక్తి కోసం నాడు ఎన్టీఆర్ తీసుకున్న పటేల్-పట్వారీ వ్యవస్థ రద్దు నిర్ణయాన్ని, సాగు-తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆయన ప్రస్తావించారు.
హైదరాబాద్ ఇవాళ ఇంతటి భారీ ఆదాయ వనరుగా మారిందంటే దానికి నాడు ఎన్టీఆర్ వేసిన పునాదులే కారణమని చంద్రబాబు పేర్కొన్నారు. తన హయాంలో సైబరాబాద్ ను నిర్మించి, ఐటీ రంగానికి తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మార్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇదంతా తెలంగాణ ప్రగతి కోసమే టీడీపీ(TDP) ప్రభుత్వం చేసిన కృషి అని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు చేసే విమర్శల వల్ల పార్టీ ప్రతిష్ట మసకబారకూడదని, విడిపోయినా అన్నదమ్ముల్లా ఉండాలే తప్ప ఒకరినొకరు దూషించుకోవడం సరికాదని చంద్రబాబు క్లాస్ పీకారు.