హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీ నిర్వహించ తలపెట్టిన ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. జూన్ 2న జరగనున్న ఈ సభను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ (TRS) కీలక నేత కల్వకుంట్ల కవిత అత్యంత ఘాటుగా స్పందించారు. జనసేనాని పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ సెంటిమెంట్‌ను రగిలిస్తూ, రాజకీయ ప్రత్యర్థులకు ఆమె నేరుగా హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ అస్తిత్వాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కవిత(Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “మాతో పెట్టుకుంటే పళ్లు రాలతాయి” అంటూ పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకసారి ఉద్యమించి కొట్లాడితేనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేసిన ఆమె, ఇది ‘టీఆర్ఎస్ 2.0’ అని.. తమ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై అనవసరమైన ఆంధ్రా రాజకీయ పంచాయితీలు పెడితే ఇక్కడి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
‘తెలంగాణ(Telangana) ఉద్యమకారుల ఆకాంక్షలు-సాధన’ అనే రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన కవిత, తన అసలు సిసలు నైజాన్ని బయటపెట్టారు. "నేను చాలా మొండిదాన్ని, మీరు అనుకున్నంత మంచిదాన్ని అసలే కాదు" అని వ్యాఖ్యానించారు. తెలంగాణ సంస్కృతిపై దాడి చేసి, ఇక్కడి ప్రజలపై ఆంధ్రా సంస్కృతిని రుద్దాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే ఇక్కడ అనధికారికంగా పెట్టిన ఆంధ్రా నాయకుల విగ్రహాలన్నింటినీ పగలగొట్టి, ప్యాక్ చేసి ఆంధ్రాకే పార్సల్ పంపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక ప్రస్తుత తెలంగాణ రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ, అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత సీఎం ఆంధ్రా రాజకీయ నాయకులకు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, అందుకే నగరంలో ఇష్టమొచ్చినట్లు ఆంధ్రా నాయకుల విగ్రహాలు పెడుతూ, ఇక్కడి అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఉంటే తెరవెనుక రాజకీయాలు మానేసి, నేరుగా ఎన్నికల బరిలో పోటీ పడాలని కవిత సవాల్ విసిరారు.