భారత రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానుల జాబితాలో అగ్రగణ్యుడిగా నిలిచి, నరేంద్ర మోదీ ఆల్ టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) పేరిట దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న సుదీర్ఘ పాలన రికార్డును మోదీ తిరగరాశారు. ఈ అద్భుత మైలురాయిని పురస్కరించుకుని ఈ నెల 10వ తేదీన దేశవ్యాప్తంగా భారీ ఎత్తున విజయోత్సవాలు నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది.
2014 మే 26న దేశ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ(Narendra Modi) , నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా జనరంజక పాలనను అందిస్తూ వస్తున్నారు. గతంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును అధిగమించిన ఆయన, ఇప్పుడు నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల సుదీర్ఘ నిరంతర పాలనను దాటేశారు. జూన్ 10 నాటికి ప్రధాని మోదీ వరుసగా 4,399 రోజులు పూర్తి చేసుకోనుండటంతో, భారత దేశ చరిత్రలోనే అత్యధిక కాలం వరుసగా పీఎం పీఠాన్ని అధిష్టించిన ఏకైక నేతగా ఆయన చరిత్ర సృష్టించారు.
2014, 2019 ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీతో దూసుకువచ్చిన మోదీ, 2024 ఎన్నికల్లో కూటమి (TDP, JDU, జనసేన తదితర మిత్రపక్షాల) మద్దతుతో ముచ్చటగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టారు. నెహ్రూ తర్వాత వరుసగా మూడుసార్లు ప్రధాని అయిన రికార్డును సొంతం చేసుకోవడమే కాకుండా, కాలపరిమితిలోనూ ఆయనను దాటిపోవడం విశేషం. ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే, సమీప భవిష్యత్తులో మోదీ నెలకొల్పిన ఈ సుదీర్ఘ పాలన రికార్డును అందుకోవడం మరెవరికీ సాధ్యం కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని దేశవ్యాప్తంగా పండుగలా జరిపేందుకు బీజేపీ(BJP) శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.