టాలీవుడ్(Tollywood)లో వివాదాలకు, సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లోకెక్కారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై పరోక్షంగా ట్వీట్ చేసిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌ను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి విషయంలోనూ తలదూర్చడం ప్రకాష్ రాజ్‌కు అలవాటుగా మారిందంటూ ఎక్స్ వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
అసలేం జరిగిందంటే.. ఇటీవల తెలంగాణ రాజకీయాలు, ఎన్నికల్లో పోటీపై పవన్ కల్యాణ్(Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రకాష్ రాజ్ సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మీరొస్తానంటే మేమొద్దంటామా?’ అంటూ సినిమా డైలాగ్‌తో ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్.. వచ్చే ఎన్నికల్లో సింగిల్‌గా వస్తారా లేక పొత్తులతో వస్తారా అంటూ పవన్‌ను ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ఈ పోస్ట్, పవన్ వీరాభిమాని అయిన బండ్ల గణేష్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.
ప్రకాష్ రాజ్(Prakash Raj) ట్వీట్‌పై బండ్ల గణేష్ ఏమాత్రం తగ్గకుండా, అత్యంత ఘాటుగా స్పందించారు. "అసలు నువ్వు ఎవడివి? తమిళోడివా, తెలుగోడివా లేక కన్నడోడివా? నీ ఊరేది, నీ కథేంటి?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతి ఊరి వ్యవహారంలోనూ, ప్రతి రాజకీయ అంశంలోనూ దూరి తీర్పులు ఇవ్వడానికి నువ్వేమైనా దేశ ప్రధానివా లేక కలెక్టర్‌వా అంటూ బండ్ల గణేష్ నిలదీశారు. ఎక్కడ చూసినా, ఏ టాపిక్ వచ్చినా మధ్యలో దూరిపోవడం ప్రకాష్ రాజ్‌కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.
ప్రతిదానికీ రియాక్ట్ అవుతూ హీరోలా ఫీలవ్వద్దంటూ ప్రకాష్ రాజ్‌కు బండ్ల గణేష్(Bandla Ganesh) గట్టి వార్నింగే ఇచ్చారు. పనిలేకపోతే ఇంట్లోనే కూర్చోవాలి కానీ, అందరి విషయాల్లో వేలు పెట్టడం సరికాదన్నారు. "ప్రపంచాన్ని మార్చే ముందు, నీ అడ్రస్ ఏంటో నువ్వు తెలుసుకో" అంటూ బండ్లన్న వేసిన పంచ్‌లు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మెగా హీరోల జోలికి వస్తే బండ్ల గణేష్ ఏ రేంజ్‌లో రియాక్ట్ అవుతారో ఈ ఘటనతో మరోసారి రుజువైందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.