ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ముగిసిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల నయా వేడి మొదలైంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలపై పట్టు సాధించేందుకు రాజకీయ పార్టీలు అప్పుడే వ్యూహప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా అధికార కూటమిని నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటి జోష్‌ను అలాగే కొనసాగిస్తూ, క్షేత్రస్థాయిలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బకొట్టడమే లక్ష్యంగా ఆయన సరికొత్త మార్క్ స్కెచ్ సిద్ధం చేశారు.
సాధారణంగా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక దగ్గర చిన్నపాటి విభేదాలు రావడం సహజం. పైగా కూటమిలో మూడు పార్టీలు (టీడీపీ, జనసేన, బీజేపీ) ఉండటంతో ఎక్కడా టికెట్ల గొడవలు రాకుండా చంద్రబాబు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రతి మండలంలోనూ కూటమి సమన్వయ కమిటీలను రంగంలోకి దించుతున్నారు. ఈ కమిటీలు కేవలం పైపైన కాకుండా.. క్షేత్రస్థాయిలోకి వెళ్లి, స్థానిక పరిస్థితులను అంచనా వేస్తాయి. ప్రతి సర్పంచ్, జడ్పీటీసీ(ZPTC), ఎంపీపీ స్థానాల్లో గెలుపు గుర్రాలను ఏరికోరి ఎంపిక చేసే బాధ్యతను వీరికి అప్పగించారు.
ఒకే సీటు కోసం కూటమి తరపున ఎక్కువ మంది పోటీ పడే అవకాశం ఉన్న చోట్ల ఈ కమిటీల పాత్ర అత్యంత కీలకం కానుంది. స్థానిక నాయకుల బలాబలాలు, ప్రజల్లో వారికున్న ఇమేజ్, గత ట్రాక్ రికార్డ్‌లను బేరీజు వేసి ఫైనల్ లిస్ట్ తయారు చేస్తారు. టికెట్ దక్కని నాయకులను బుజ్జగించి, కూటమి అభ్యర్థి గెలుపు కోసం పని చేసేలా ఒప్పించడమే ఈ కమిటీల ప్రధాన టాస్క్. నాయకుల మధ్య సమన్వయం కుదిరితే సగం విజయం సాధించినట్లేనని చంద్రబాబు(Chandrababu) భావిస్తున్నారు.
కాగా, గత స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు, అధికార బలంతో వైసీపీ(YCP) సాధించిన మైలేజీకి ఈసారి గట్టి బ్రేకులు వేయాలని కూటమి భావిస్తోంది. చంద్రబాబు వేస్తున్న ఈ ముందస్తు వ్యూహాలు, కమిటీల ప్లానింగ్ చూస్తుంటే.. ప్రతిపక్ష పార్టీకి స్థానిక పోరులో కోలుకోవడం అంత సులువు కాదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి బాబు మార్క్ స్కెచ్ క్షేత్రస్థాయిలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.