ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరం(Mylavaram) నియోజకవర్గంలో వైసిపి ప్రభావం ఎక్కడ కనిపించడం లేదు. పార్టీ తరఫున ఎవరు వాయిస్ వినిపించడం కూడా లేదు. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో చక్రం తిప్పాలని వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించాలని మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు అయితే చేశారు. అయితే ఆయన వివాదాల చుట్టూనే తిరగడం.. ఏం మాట్లాడినా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.
దీంతో పాటు సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) టార్గెట్గా చేసుకుని చేసిన వ్యాఖ్యలు వంటివి తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసాయి. దీనికి తోడు కేసుల ఊబిలో మాజీమంత్రి జోగి రమేష్ కురుకు పోయారు. దీంతో నియోజకవర్గంలో ఆయన ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అదే సమయంలో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన శర్నాల తిరుపతిరావు కూడా ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు.
వాస్తవానికి ఆయన పార్టీలో ఉన్నారా లేరా అనేది కూడా చూడాలి. దీంతో వైసిపి రాజకీయాలు ఎక్కడ కనిపించడం లేదనేది వాస్తవం. అంతేకాదు వైసీపీ(YCP) తరఫున జెండా ఎగరడం కూడా లేదనేది స్థానికంగా నాయకులు చెబుతున్న మాట. మరోవైపు మైలవరం ఎమ్మెల్యే టిడిపి నాయకుడు వసంత కృష్ణ ప్రసాద్ దూకుడు పెంచారు. గట్టిపట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ తరఫున ఇటీవల ఆయనకు మరో పదవి కూడా దక్కిన విషయం తెలిసిందే.
దీంతో మరింత ఉత్సాహంగా నియోజకవర్గంలో పనిచేస్తుండడం విశేషం. పార్టీ నాయకులను కలుపుకొని వెళ్లడంతో పాటు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహణ సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను ప్రశంసిస్తూ చేపట్టే కార్యక్రమాలు వంటివి భారీ స్థాయిలో పుంజుకున్నాయి. అదే సమయంలో కూటమి పార్టీల తరఫున కూడా ఆయన వాయిస్ వినిపిస్తున్నారు. కూటమి నాయకులను కూడా కలుపుకొని పోతున్నారు. ఈ పరిణామాల ను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా వసంత కృష్ణ ప్రసాద్ గెలుపును ఎవరు ఆపలేరు అన్నది స్పష్టం అవుతుంది.