వైసీపీ వర్సెస్ టీడీపీ(TDP) రాజకీయాలు మరింత వేడెక్కాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువయ్యేందుకు.. ఒక పార్టీపై మరో పార్టీ వ్యతిరేకతను పెంచుకునేందుకు రెండు పార్టీలు కుస్తీపడుతున్నాయి. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు నిరసన`కు ప్రతిగా టీడీపీ కూడా.. `రాక్షసపాలన అంతానికి రెండేళ్లు పేరుతో నిరసన చేపట్టింది. తద్వారా రెండు పార్టీలు.. గురువారం జోరుగానే కార్యక్రమాలు చేపట్టారు. అయితే.. దీనివల్ల రెండు పార్టీలకు జరిగిన మేలేంటి? అనేది ప్రశ్న.
సాధారణంగా అధికార పార్టీపై విపక్షం ప్రచారం చేయడం కామనే. అయితే.. గత ఎన్నికల్లో తాము ఓడిపో యామన్న ఆవేదన.. టీడీపీ(TDP) కూటమి అధికారంలోకి వచ్చిందన్న బాధ రెండింటినీ కలగలిపి.. వెన్నుపోటు పేరుతో వైసీపీ చేపట్టిన నిరసన పెద్దగా పేరు రాలేదనే చెప్పాలి. ఇటీవల చేపట్టిన నిరసనల మాదిరిగానే తూతూ మంత్రంగా నాయకులు హాజరయ్యారు. ఫలితంగా పెద్ద చర్చ లేకుండానే .. ఈ కార్యక్రమం ముగిసిపోయింది. సీనియర్ నాయకుల్లో చాలా మంది ఎండ ప్రభావం చూపించి ఇంటికే పరిమితం అయ్యారు.
ఇక, టీడీపీ(TDP) చేపట్టిన రాక్షస పాలన అంతమై.. రెండేళ్లు కార్యక్రమం మీడియా సమావేశాలతో జోరెత్తించారు. ఎక్కడికక్కడ నాయకులు మీడియా ముందుకు వచ్చి వైసీపీ పాలనలో జరిగిన అన్యాయాలు, అక్రమాలను ప్రస్తావించారు. ముఖ్యంగా డాక్టర్ సుధాకర్ మృతి, పోలీసులు వేధించిన తీరు, పెట్టిన కేసులను వివరిం చారు. ఇదేసమయంలో అనంతబాబు.. శవం డోర్‌డెలివరీ వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. అక్రమ మద్యం, ఇసుక దోపిడీ చేశారని నాయకులు విమర్శించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే.. అధికార పక్షం లోపాలను వైసీపీ(YCP), వైసీపీ లోపాలను టీడీపీ ఎత్తి చూపుకొన్నా యి. ఇంతకుమించి ఈ రెండు నిరసనలతో జరిగింది ఏమీ కనిపించలేదు. అయితే.. రెండు కార్యక్రమాల ను పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు ప్రతిష్టాత్మకంగానే నిర్వహించాయి. మరోవైపు.. పార్టీల కు ఈ కార్యక్రమాల ద్వారా పెరిగిన గ్రాఫ్‌గానీ.. వచ్చిన లాభం కానీ పెద్దగా లేదనే చెప్పాలి. మరి ఇదే విధానం కొనసాగితే.. ఏం జరుగుతుందన్నది చూడాలి.