``ఎవరు చెప్పారని మా అబ్బాయి పేరు పెట్టారు?`` అంటూ.. అధికారులపై మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ప్రస్తుతం ఆయన రష్యా పర్యటనలోనే ఉన్నప్పటికీ.. సంబంధిత అధికారులను ఉద్దేశించి ఆన్‌లైన్ వేదికగా నిప్పులు చెరిగారు. `'ఇష్టానుసారం వ్యవహరించేవారు.. నన్ను మచ్చిక చేసుకోవాలని భావించేవారు.. తమ విధానాలు మార్చుకోవాలి.`` అని నేరుగా చెప్పారు. అంతేకాదు.. ఇది వైసీపీ ప్రభు త్వం కాదని.. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వమని వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసు కుంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం ఇటీవల అనుమతులు ఇచ్చింది. తొలి దశలో 100 కోట్లరూపాయల వరకు అభివృద్ధి పనులు చేయాలని సూచించింది. దీంతో తూర్పుగోదావరి, పశ్చిమ గోదా వరి జిల్లాల్లో పనులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం దాతల నుంచికూడా విరాళాలు తీసుకోవాలని సూచించింది. ఇది ప్రతి పుష్కరాల సమయంలోనూ జరిగేదే.
ఇలా నిర్దేశిత మొత్తంలో విరాళం ఇచ్చిన వారి పట్ల కృతజ్ఞతతోపాటు.. వారి కోరిక మేరకు.. పుష్కరాల కో సం ఏర్పాటు చేసే ప్రత్యేక ఘాట్లకు వారి పేర్లను, లేదా వారు సూచించిన పేర్లను పెడుతుంటారు. అయి తే.. ఓ పుష్క ఘాట్‌కు నారా `దేవాన్ష్` ఘాట్ అంటూ.. అదికారులు పేరు పెట్టారు. ఈ వ్యవహారంపై గత 24 గంటలుగా సోషల్ మీడియాలో రచ్చ సాగుతోంది. వైసీపీ నాయకులు ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సెటైర్లు పేలుస్తున్నారు. దీనిని గమనించిన మంత్రి లోకేష్ అధికారుల తీరుపై నిప్పులు చెరిగారు.
ఎవరు చెప్పారని దేవాన్ష్ పేరు పెట్టారని ప్రశ్నించారు. తిరుమలలో విరాళం ఇస్తున్నాం కాబట్టి.. అక్కడ పేరు పెట్టారని.. ఇక్కడ ఎవరు విరాళం ఇవ్వలేదని.. తమ కుటుంబం నుంచి ఎవరూ ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అసలు పవిత్ర కార్యక్రమాలు, పుష్కరాల వంటి కార్యక్రమాల్లో తమ పేర్లు వినియోగించవద్దని ఆయన అధికారులకు తేల్చి చెప్పారు. ఇకపై ఎవరైనా దేవాన్ష్ పేరు వినియోగిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లోకేష్ వార్నింగ్ ఇవ్వడంతో ఆ ఘాట్ కు దేవాన్ష్ పేరును అధికారులు తొలగించారు.