కేసీఆర్ బస్సు యాత్ర.. ముహూర్తం ఫిక్స్‌..!

admin
Published by Admin — June 08, 2026 in Politics, Telangana
News Image

తెలంగాణ(Telangana) రాజకీయాల్లో మరో భారీ పొలిటికల్ సునామీకి తెరలేవబోతోంది. గడచిన రెండున్నరేళ్లుగా వ్యూహాత్మక మౌనం పాటిస్తూ, ఫామ్‌హౌస్‌కే పరిమితమైన గులాబీ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇక పూర్తిస్థాయిలో మైదానంలోకి దిగడానికి క్షేత్రస్థాయి వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన గ్రేస్ పీరియడ్ ముగిసిందని భావిస్తోన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా సరికొత్త యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయబోతున్నారు.

ఇందులో భాగంగానే తెలంగాణ రాజకీయాలను హీటెక్కించేలా కేసీఆర్(KCR) 'మహా బస్సు యాత్ర'కు ముహూర్తం ఖరారైంది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉందనగా, అంటే 2027లో ఈ బస్సు యాత్ర రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ లోపే పార్టీ క్యాడర్‌లో జోష్ నింపేందుకు, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకునేందుకు కేసీఆర్ రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై కేసీఆర్ కేవలం ప్రసంగాలకే పరిమితం కాకుండా.. నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటూ కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటాలు చేయనున్నారు.

అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ ఎందుకు యాక్టివ్‌గా లేరనే ప్రశ్నకు బీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు(Harish Rao) ఆసక్తికర సమాధానమిచ్చారు. కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కారుకు ప్రజల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఇన్నాళ్లూ రెస్ట్ మోడ్‌లో ఉన్నారని స్పష్టం చేశారు. అయితే, గత రెండున్నరేళ్లలో ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, అందుకే ఇప్పుడు కేసీఆర్ స్వయంగా ప్రజల్లోకి రాక తప్పడం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక బస్సు యాత్ర(BusYatra)కు ముందే కేసీఆర్ తన పొలిటికల్ స్పీడ్‌ను పెంచనున్నారు. ఇకపై నిరంతరం అందుబాటులో ఉండేలా హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ కు ఆయన రాకపోకలు పెంచబోతున్నారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎక్కడికక్కడ ఉద్యమాలకు పిలుపునివ్వడం వంటి కార్యక్రమాలతో గులాబీ దళాన్ని ఎన్నికల మూడ్‌లోకి తీసుకెళ్లనున్నారు. జిల్లాల పర్యటనలతో మొదలై, 2027 బస్సు యాత్రతో పీక్‌ స్టేజ్‌కి చేరే ఈ వ్యూహం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

Tags
KCR BRS Telangana Politics KCR Bus Yatra Revanth Reddy Telangana Elections
Recent Comments
Leave a Comment

Related News