మిన్నేటి సూరీడు వచ్చెనమ్మా.. అనేపాట తెలియనివారు.. విననివారు.. నేటి జనరేషన్‌లో కూడా లేరంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎంతో మంది దర్శకులు కాదు పొమ్మన్న ఓ నల్లపిల్ల(ముచ్చెర్ల అరుణ)ను తొలిసారి వెండితెరకు పరిచయం చేయడమే కాదు.. అసలు మేకప్ లేని సీన్లు కూడా చేయించి.. తన ఘనతను చాటుకున్న దిగ్గజ దర్శకుడు.. 1980లలో వెండితెరపై అప్రతిహతంగా దూసుకుపోయిన సీతాకోక చిలుక వంటి.. ఆణిముత్యాన్ని అందించిన భారతీ రాజా ఇకలేరు.
సెలవు తీసుకుంటున్నా.. అంటూ నింగికేగిపోయారు. మంగళవారం ఉదయం చెన్నైలోని తన స్వగృహంలో 85 ఏళ్ల భారతీ రాజా తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా వయోసంబంధిత సమస్యలతోపాటు.. ఇతర అనారోగ్యాలతో వీల్ చైర్‌కే పరిమితమైన ఆయన.. కన్నుమూశారు. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులతోపాటు.. కోలీవుడ్, శాండిల్‌వుడ్ పరిశ్రమలు కూడా.. దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. భారతీ రాజా ఇక లేరన్న వార్తతమను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తొలినాళ్లలో లైట్ బాయ్‌గా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన భారతీ రాజా.. దిగ్గజ దర్శకుల పనితీరును నిశితంగా గమనించారు. అప్పటికే ఆయనలో ఉన్న సృజనాత్మకతకు.. ఆలోచనలకు పదును పెట్టి.. `పదహారేళ్ల వయసు`(తెలుగు) కథకు ప్రాణం పోశారు. ఈ సినిమా నిర్మాణానికి ఆయన తిరగని స్టూడియో.. సంప్రదించని నిర్మాత లేరని అంటారు. ఇలా.. ప్రారంభమైన భారతీ రాజా ప్రయాణం.. తొలిసినిమాతో సూపర్ హిట్ సాధించింది. తెలుగులో వచ్చిన హీరో కృష్ణ జమదగ్ని సినిమా బ్లాక్ బ్లస్టర్‌గా నిలిచింది.
తరాల అంతరాలను నిశితంగా గమనించే భారతీ రాజా.. ఏ తరానికి ఏదిఇష్టమనే విషయాన్ని తెలుసుకు ని.. దానికి అనుగుణంగానే కథలు అల్లేవారు. మూస విధానాలకు ఆయన సుతరాము వ్యతిరేకం అంటారు.. అప్పటి నిర్మాతలు, నటులు కూడా. ఎందుకూ పనికిరాదని వదిలేసిన వ్యక్తుల నుంచి ఆణిముత్యాలు సృష్టించిన చరిత్రను ఆయన సొంతం చేసుకున్నారు. తమిళం సహా 7 భాషల్లో ఆయన సినిమాలు తీశారు. ఏడు భాషలపైనా ఆయన పట్టు పెంచుకున్నారు. ఎక్కువ మాటలు కాదు.. చేతలు కనిపించాలి.. అదే ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది.. అని చెప్పే భారతీ రాజా.. తన సినిమాల్లో వీటికే ప్రాధాన్యం ఇచ్చారు.