వైసీపీ అధినేత జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ అంశంపై గత ఐదేళ్లలో జగన్ వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. ‘విశాఖ స్టీల్ ప్లాంట్’ అనే పదం పలికే అర్హత కూడా జగన్ కు లేదని ఎద్దేవా చేశారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను రాజధాని అవసరాల కోసం వినియోగించుకోవాలని జగన్ భావించారని, ఈ విషయాన్ని ఒక సీనియర్ IAS అధికారి స్వయంగా వెల్లడించారని అనిత ఆరోపించారు. కార్మికులు సంవత్సరాల తరబడి ఆందోళనలు చేస్తుంటే జగన్ కనీసం ఒక్కరోజు కూడా ధర్నా ప్రాంగణానికి వెళ్లి వారికి మద్దతు తెలపలేదని మండిపడ్డారు.
అప్పట్లో కార్మికులను విమానాశ్రయానికి పిలిపించుకుని మాట్లాడిన జగన్ ఇప్పుడు కూడా కార్మిక సంఘాల నాయకులను తన వద్దకే పిలిపించుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదాల్లో మరణించిన కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి తొలిసారిగా ‘శాశ్వత ఉద్యోగం’ కల్పించే చారిత్రాత్మక నిర్ణయం కేంద్ర ఉక్కు మంత్రి హెచ్.డి. కుమారస్వామి తీసుకున్నారని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన LG పాలిమర్స్ ప్రమాదంపై స్పందిస్తూ, ఆ సంస్థ రూ.150 కోట్ల బీమా చెల్లించాల్సి ఉండగా జగన్ ప్రభుత్వం కేవలం రూ.12 కోట్లు మాత్రమే కట్టించుకుని చేతులు దులుపుకుందని అనిత ఆరోపించారు .విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా కాపాడింది తమ కూటమి ప్రభుత్వమేనని, ప్లాంట్ పరిరక్షణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.