టీడీపీకి పొలిటికల్ ఫ్యాక్టరీ-వైసీపీది క్రిమినల్స్ ఫ్యాక్టరీ అని మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. టీడీపీ తరఫున రాజకీయాల్లోకి వచ్చిన వారు.. రాష్ట్రాలను ఏలుతున్నారని.. వైసీపీ తరఫున రాజకీయాల్లోకి వచ్చిన వారు..జైళ్లను ఏలుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్కరైనా వైసీపీ తరఫున రాజకీయాలు చేసిన వారు.. బాగున్నారా? వారి గ్రాఫ్ బాగుందా? ఒక్కరైనా ప్రజలకు మేలు చేశామని గుండెలపై చేయి వెసి చెప్పగలరా? అని ప్రశ్నించారు.
అంతేకాదు.. టీడీపీ తరఫున రాజకీయాల్లోకి వచ్చిన వారు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర మంత్రులు కూడా అయ్యారని.. వైసీపీ తరఫున రాజకీయాలు చేస్తున్నవారు.. కేసులకు భయపడి ఇళ్లలోనే తలదాచుకుంటున్నారని విమర్శించారు. వైసీపీని స్థాపించి ఏదో బ్రహ్మాండం బద్దలు కొట్టినట్టు చెబుతున్న జగన్ కూడా. కేంద్రానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క రోజైనా.. ఒక్క క్షణమైనా..ఆయన నీట్ గురించి కానీ.. ధరల పెరుగుదల గురించి కానీ.. మాట్లాడారా? అని నిలదీశారు.
కాపుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ చలిమంటలు వేసుకుంటున్న వైసీపీకి కాపులే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. కాపుల ఐక్యతను గొడ్డలి పార్టీ ఎప్పటికీ విచ్ఛిన్నం పెట్టి.. రాజకీయంగా లబ్ధిపొందాలనుకునే వైసీపీకి రోజులు చెల్లాయని ప్రజలు చైతన్యంతో ఆలోచన చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి ఇప్పుడు కావాల్సింది.. కులాలు.. గోత్రాలు కావని, అభివృద్ధి, ఉద్యోగాలు, పరిశ్రమలు, పెట్టుబడులు, సంక్షేమం మాత్రమేనన్నారు. విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. గొడ్డలి పార్టీ నాయకులు.. విధ్వంసం నుంచి మరింత విధ్వంసం దిశగా పరుగులు పెడుతున్నారని.. ప్రజలు వారిని భూస్థాపితం చేస్తారని వ్యాఖ్యానించారు.