కేంద్రంలో త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా తెలంగాణ(Telangana) రాజకీయాల్లో ఈ పరిణామం పెను దుమారం రేపుతోంది. రాష్ట్రం నుంచి ఇప్పటికే ఇద్దరు నేతలు కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, రాబోయే మార్పుల్లో మరికొందరికి అదృష్టం వరించనుందనే వార్తలు గులాబీ, కాషాయ శ్రేణుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి. ఢిల్లీ పెద్దల పిలుపు కోసం ఎదురుచూస్తున్న ఆశావహులు.. అప్పుడే తమ ప్రయాణాలను సిద్ధం చేసుకుని హుటాహుటిన హస్తిన బాట పట్టడం గమనార్హం.
ఈసారి జరగబోయే విస్తరణలో తెలంగాణ నుంచి సరికొత్త సామాజిక, ప్రాంతీయ సమీకరణాలు తెరపైకి రానున్నాయి. ఒకవేళ అధిష్టానం రెండు పదవులను కేటాయిస్తే.. ఒకటి బీసీ వర్గానికి, మరొకటి మహిళా లేదా ఎస్టీ కోటాకు దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఒకే ఒక్క సీటు పరిమితమైతే మాత్రం, అది ఖచ్చితంగా వెనుకబడిన వర్గాలకే చెందుతుందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ సమీకరణాల నేపథ్యంలోనే నలుగురు కీలక నేతలు కేంద్ర కేబినెట్(Central Cabinet)లో మంత్రి పదవి కోసం అధిష్టానం వద్ద గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
రేసులో నిలిచిన ఆ ‘నలుగురు’ నేతలు వీరే:
ఈటల రాజేందర్(EatalaRajender): గతంలో రాష్ట్ర పార్టీ పగ్గాల రేసులో నిలిచి, చివరి నిమిషంలో అవకాశం కోల్పోయిన ఈటల రాజేందర్‌కు ఈసారి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కడం ఖాయమనే ధీమా ఆయన అనుచరుల్లో వ్యక్తమవుతోంది. గతంలో అధిష్టానం ఇచ్చిన హామీయే దీనికి ప్రధాన కారణమని సమాచారం.
గోడం నగేశ్(Godam Nagesh): ఆదిలాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈయన.. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఆదివాసీ ఎంపీ కావడంతో ఎస్టీ సమీకరణాల కింద తనకు బెర్త్ కన్ఫర్మ్ అవుతుందనే గట్టి నమ్మకంతో ఉన్నారు.
అర్వింద్ కుమార్(Arvind Dharmapuri): నిజామాబాద్ ఎంపీగా గట్టి పట్టున్న అర్వింద్.. బీసీ సామాజిక సమీకరణాల్లో భాగంగా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడానికి తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
డీకే అరుణ(DK Aruna): మహబూబ్‌నగర్ నుంచి గెలుపొందిన సీనియర్ నేత డీకే అరుణ కూడా మంత్రి పదవిపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అటు మహిళా కోటాతో పాటు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో పార్టీ అగ్రనాయకత్వం ఇచ్చిన భరోసా తనకు ప్లస్ అవుతుందని ఆమె భావిస్తున్నారు. ఏదేమైనా, మరో రెండు మూడు రోజుల్లో తేలనున్న ఈ కేబినెట్ లైనప్‌లో తెలంగాణ నుంచి ఎవరికి మోదీ టీమ్‌లో లక్ చిక్కుతుందో చూడాలి.