సాయికృష్ణ(Saikrishna) లాకప్ డెత్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితులను పట్టుకునే కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం లాకప్ డెత్‌తోనే కథ ముగిసిపోలేదని, దీని వెనుక ఒక పెద్ద నెట్‌వర్కే పనిచేసిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ముఖ్యంగా సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సేకరించిన ప్రాథమిక ఆధారాలు ఇప్పుడు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీఐ నాగరాజు ఒంటరిగా ఈ ఘాతుకానికి పాల్పడలేదని సిట్ విచారణలో తేలింది. నాగరాజుకు అత్యంత నమ్మకస్తులైన ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లు, అలాగే అతనికి సన్నిహితుడైన మరో ప్రైవేట్ వ్యక్తి ఈ మృతదేహం మాయం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. సీఐ నాగరాజు(CI Nagaraju) ఆదేశాలతోనే వీరంతా కలిసి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు స్కెచ్ వేశారనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ఈ వ్యవహారంలో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, జంగం నాని, మరియు సీఐ సన్నిహితుడు సురేశ్. సీఐ నాగరాజుకు కుడిభుజంలా వ్యవహరించిన అశోక్(Ashok), ప్రతి అడుగులోనూ అతనికి అసిస్టెంట్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఇక మరో హెడ్‌కానిస్టేబుల్ జంగం నాని కథ మరీ విచిత్రంగా ఉంది. గతంలోనే పలు అక్రమాల ఆరోపణలతో పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్)కు బదిలీ అయిన నాని, ఇటీవలే కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో పోస్టింగ్ సంపాదించాడు. సీఐ పేరు చెప్పుకుని ప్రైవేట్ సెటిల్‌మెంట్లు చేయడంలో ఇతడే నెంబర్ వన్ అని పోలీసు వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఇక ప్రస్తుతం సీఐ నాగరాజు అరెస్ట్ కావడంతో మిగిలిన ముగ్గురు నిందితుల్లో వణుకు మొదలైంది. అరెస్ట్ భయంతో అశోక్, జంగం నాని, సురేశ్‌లు రాత్రికి రాత్రే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. తమ లొకేషన్ దొరకకుండా ఉండేందుకు మొబైల్ ఫోన్లను సైతం స్విచ్ఛాఫ్ చేయడంతో వీరిని పట్టుకోవడం సిట్(SIT) అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది. అయినప్పటికీ వీరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి.