ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమరం ఎప్పుడూ వేడి వేడిగానే ఉంటుంది. అయితే ఈసారి వివాదం రాష్ట్ర ఆర్థిక రథచక్రాల లాంటి డ్వాక్రా (DWACRA) మహిళా సంఘాల చుట్టూ తిరుగుతోంది. కూటమి ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెట్టే క్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వేసిన ఒక పొలిటికల్ స్కెచ్, ఇప్పుడు ఆయనకే రివర్స్ అయిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. డ్వాక్రా మహిళల రుణాల విషయంలో జగన్ చేసిన ఆరోపణలను కూటమి ప్రభుత్వం అధికారిక లెక్కలతో తిప్పికొట్టడంతో, ప్రతిపక్ష నేత పరువు పోయే పరిస్థితి వచ్చిందంటూ అధికార పక్షం కౌంటర్లు ఇస్తోంది.
అసలు కథేంటంటే.. కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళలను పూర్తిగా విస్మరించిందని, వడ్డీ రాయితీలు ఇవ్వకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిందని జగన్ గట్టిగానే గళమెత్తారు. చంద్రబాబు(Chandrababu) సర్కార్ తీరు వల్ల మహిళలు ఏకంగా రూ.6 వేల కోట్లు నష్టపోయారంటూ భారీ గణాంకాలతో విమర్శలు గుప్పించారు. గత తమ హయాంలో ఐదేళ్లలో రూ.4,969 కోట్లు వడ్డీ రాయితీగా ఇచ్చి మహిళలను ఆదుకున్నామని, ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఈ క్రమంలో మహిళా లోకంలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకు వైసీపీ గట్టి ప్రయత్నమే చేసింది.
కానీ, ఇక్కడే సీన్ రివర్స్ అయింది. జగన్ ఆరోపణలు చేసిన కొన్ని గంటల్లోనే కూటమి ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. ఊరికే మాటలతో కాకుండా, ఏకంగా 'ఫ్యాక్ట్ చెక్' (Fact Check) బులిటెన్‌ను అధికారిక గణాంకాలతో సహా బయటపెట్టింది. గత ఆరేళ్లుగా మహిళా సంఘాలకు అందుతున్న రుణాల గ్రాఫ్‌ను ప్రదర్శిస్తూ.. ఎక్కడా రుణాలు తగ్గలేదని, పైగా కేంద్ర ప్రభుత్వం హామీ లేని రుణ పరిమితిని రూ.10 లక్షల నుండి ఏకంగా రూ.20 లక్షలకు పెంచిందని స్పష్టం చేసింది. దీనివల్ల గతంలో కంటే ఇప్పుడే మహిళలకు మరింత సులభంగా, భారీ మొత్తంలో రుణాలు అందుతున్నాయని తేల్చి చెప్పింది.
ప్రభుత్వం ఇచ్చిన ఈ లెక్కల షాక్ తో జగన్ ఆరోపణల్లో పస లేదనే టాక్ నడుస్తోంది. గతంలో ఒకేసారి భారీగా రుణాలు పెరగడం వల్ల, ఇప్పుడు కొత్త రుణాల వృద్ధి రేటు కొంత మందగించడం సహజమైన ఆర్థిక ప్రక్రియేనని, దాన్ని పట్టుకుని వ్యవస్థ విఫలమైంది అని ప్రచారం చేయడం జగన్(Jagan) అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఎలాంటి హోంవర్క్ లేకుండా, కనీస వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం బురదజల్లడమే లక్ష్యంగా జగన్ మాట్లాడటం వల్లే ఇప్పుడు ఆయన పరువు పోయే పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ డ్వాక్రా రుణాల రచ్చ చివరకు వైసీపీకే సెల్ఫ్ గోల్‌గా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.