బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా భగీరథ్ చర్లపల్లి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే, తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఈ రోజు విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే బాధితురాలి వాదనలు విన్న తర్వాత ఆ బెయిల్ పిటిషన్ పై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కౌంటర్ దాఖలు చేయాలని బాధితురాలి తరపు న్యాయవాదికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఈ కేసు విచారణ ఎల్లుండికి వాయిదా పడింది.
అయితే, బాధితురాలి తరఫున కోర్టులో ఎటువంటి వాదనలు వినిపించబోతున్నారు అన్న విషయంపై ఉత్కంఠ ఏర్పడింది. ఏది ఏమైనా కోర్టు సినిమాలో సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుందా అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. బండి భగీరథ్ కు బెయిల్ వస్తుందా లేక జైల్లోనే ఉంటారా అన్న చర్చ మొదలైంది.
వాస్తవానికి జూన్ 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు బండి భగీరథ్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ పరీక్షలు రాయాలన్న ఆయన అభ్యర్థనను హైకోర్టు పరిగణలోకి తీసుకొని మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పరీక్షలు పూర్తయిన వెంటనే ఆయన మళ్ళీ జైలుకు వెళ్లారు. ఆ తర్వాత తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల విచారణకు సహకరిస్తున్నారని, ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అని, తన క్లైంట్ కు బెయిల్ మంజూరు చేయాలని భగీరథ్ తరఫు న్యాయవాది వాదించారు.