రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం పదేళ్లు వెనక్కి పోయిందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండున్నర ఏళ్ల పాలనపై చర్చకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాజాగా ఆ సవాల్ ను స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎండగట్టకపోతే తాను రాజకీయాల నుంచి నిష్క్రమిస్తానని కేటీఆర్ షాకింగ్ ప్రకటన చేశారు.
రైతు డిక్లరేషన్ అని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వరంగల్ చౌరస్తాలో ప్రకటన చేశారని, అక్కడ చర్చకు తాను సిద్ధమని కేటీఆర్ అన్నారు. లేదంటే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ తెలంగాణ యువతను మోసం చేసిన అశోక్ నగర్ చౌరస్తాలో అయినా చర్చకు రెడీ అని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి వచ్చినా పర్వాలేదని రాహుల్ గాంధీని పంపించినా పర్వాలేదని...ఎవరు వస్తారో రండి అంటూ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
చర్చ జరిగే ప్లేస్, డేట్, టైం, టాపిక్ రేవంత్ చెప్పినా సరే తనని చెప్పమన్నా సరే అంటూ బాలయ్య బాబు రేంజ్ లో కేటీఆర్ డైలాగ్ తో సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి చేస్తున్నది చెత్త పాలన అని, పైగా దానిపై చర్చకు రావాలంటూ సవాల్ చేయడం హాస్యాస్పదమని కేటీఆర్ సెటైర్లు వేశారు. మరి కేటీఆర్ సవాల్ రేవంత్ రెడ్డి స్వీకరిస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.