ఫైన్ కడితే కేసులు కొట్టేస్తున్న ఈడీ!

admin
Published by Admin — July 07, 2026 in National
News Image

దేశంలో ఈడీ అంటే తెలియ‌నివారు ఎవ‌రూ లేరు. ఎన్‌ఫోర్స్ మెంటు డైరెక్ట‌రేట్‌(ఈడీ) వ‌స్తోంద‌న్నా.. దాడులు చేసే అవ‌కాశం ఉంద‌న్నా... రాజ‌కీయ ప్ర‌ముఖుల నుంచి పారిశ్రామిక వేత్త‌ల వ‌ర‌కు హ‌డ‌లిపోతారు. ఎందుకంటే.. ఈడీ దూకుడు ఆ ర‌కంగా ఉంటుంది. అయితే.. ఈ ఏడాది గ‌డిచిన నాలుగు మాసాల్లో ఈడీ ప‌లు కేసుల‌ను ఎత్తేసింది. ఇవేవో ఒక‌టో రెండో కేసులు అయితే.. పెద్ద‌గా ఆశ్చ‌ర్యం ఉండాల్సిన అవ‌స‌రం లేదు. కానీ, వంద‌ల కోట్ల రూపాయ‌ల ఉల్లంఘ‌న‌లు, విదేశాల నుంచి దొడ్డిదారిలో తీసుకువ‌చ్చిన నిధుల‌తో భార‌త్‌లో వ్యాపారాలు చేస్తున్నాయంటూ ఆరోపించిన సంస్థ‌ల‌పైనే ఈడీ కేసులు ఎత్తేసింది.

ఈ వ్య‌వ‌హారం తాజాగా వెలుగు చూడ‌డంతో రాజ‌కీయంగా కేంద్ర ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈడీ న‌మోదుచేసిన కేసుల‌కు సంబంధించి ఆర్బీఐ కూడా ప‌రిశీల‌న చేస్తుంది. ఆయా కేసులు కోర్టుల‌కు వ‌చ్చిన‌ప్పుడు న‌గ‌దు వ్య‌వ‌హారాల‌పై ఆర్బీ ఐ కూడా త‌న వాద‌న‌లు వినిపించాలి. కానీ, ఇక్క‌డే కేసులు కీల‌క మ‌లుపు తిరుగుతున్నాయి. తాము వాద‌న‌లు వినిపించా ల్సిన అవ‌స‌రం లేదంటూ.. ఆర్బీఐ నేరుగా అధికారిక ప‌త్రం ఇస్తోంది. ఫ‌లితంగా ఆయా కీల‌క కేసుల్లో కోర్టులు ఎలాంటి తీర్పులు ఇవ్వ‌కుండా పెండింగులో పెడుతున్నాయి. దీంతో తాజాగా ఈడీ ఆయా కేసుల‌ను స్వ‌ల్ప జ‌రిమానాల‌తో ఎత్తేసింది.

అంద‌రికీనా..?

అయితే.. ఇలా కేసులు ఎత్తేయ‌డం అనేది అంద‌రికీ వ‌ర్తిస్తోందా? అంటే.. కాదని నిపుణులు చెబుతున్నారు. ఈడీ కేసులు ఎదుర్కొన్న వారు, సంస్థ‌ల‌కు చెందిన ప్ర‌ముఖులు త‌మ‌కు ఉన్న రాజ‌కీయ ప‌లుకుబ‌డిని వినియోగించుకుని ఆయా కేసుల‌ను ప‌రిష్క‌రించుకుంటున్నార‌ని చెబుతున్నారు. త‌ద్వారా ఇక‌, వారిపై ఎలాంటి విచార‌ణ‌లు ఉండ‌వు. అంతేకాదు.. ఫెమా(ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌) కూడా వారికి వ‌ర్తించ‌కుండా ఈ `జ‌రిమానా`  వ్య‌వ‌హారాలు అంత్యంత గోప్యంగా ముందుకు సాగుతున్నాయ‌ని నేష‌న‌ల్ మీడియా కూడా పేర్కొన‌డం గ‌మ‌నార్హం. అంటే ఒక‌ర‌కంగా ప్ర‌జ‌లంతా ఏదో ఒక విష‌యంపై దృష్టి పెట్టిన స‌మ‌యంలో తెర‌చాటున ఈ వ్య‌వ‌హారాలు ముందుకు సాగుతున్నాయ‌ని స్ప‌ష్టం అవుతోంది.

కాకినాడ కేసు కూడా..

+ ఈడీ రాజీ చేసుకున్న వంద‌ల కోట్ల రూపాయ‌ల ఉల్లంఘ‌న కేసుల్లో కాకినాడ పోర్టు కేసు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం.
+ గ‌త 15 మాసాల‌లో 150 ఫెమా కేసుల‌ను ఈడీ రాజీ చేసుకుంది.
+ ఆయా కేసుల విచార‌ణ అవ‌స‌రం లేద‌ని, మూసేసినా ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ఆర్బీఐ తేల్చి చెప్పింది.
+ దేశాన్ని కుదిపేసిన అపోలో ఆసుప‌త్రుల 850 కోట్ల రూపాయ‌ల ఉల్లంఘ‌న కేసును.. 17 కోట్ల రూపాయ‌ల జ‌రిమానాతో మూసేశారు.
+ ఫ్లిప్‌కార్టుకు సంబంధించిన 45 కోట్ల రూపాయ‌ల ఉల్లంఘ‌న కేసును కేవ‌లం 2.8 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానాతో స‌రిపెట్టారు.
+ కాకినాడ సీపోర్టులో లావాదేవీలలో 1500 కోట్ల రూపాయ‌ల ఉల్లంఘ‌న‌లు జ‌రిగాయ‌ని ఈడీ న‌మోదు చేసిన కేసును 21.7 ల‌క్ష‌ల రూపాయ‌ల జ‌రిమానాతో మూసేశారు.

Tags
ED compromising cases fine penalty
Recent Comments
Leave a Comment

Related News