పవన్ కు సుగాలీ ప్రీతి తల్లి పార్వతి షాక్!

admin
Published by Admin — July 07, 2026 in Politics
News Image

సుగాలీ ప్రీతి కేసులో న్యాయం చేస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ 2024 ఎన్నికల ప్రచారంలో చెప్పిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాను తొలి సంతకం పెట్టబోయే ఫైల్ అదే అంటూ పవన్ చెప్పారు. అయితే, పవన్ చెప్పినట్లు జరగలేదు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ పై సుగాలీ ప్రీతి తల్లి పార్వతీ దేవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా పవన్ పైనే గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

తన కూతురు మరణాన్ని పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆమె ఆరోపించారు. అంతేకాదు, ఈ కేసు విచారణ జరిపి దోషులకు శిక్ష పడేలా చేస్తానని చెప్పిన పవన్ తమకు నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. పవన్‌పై చీటింగ్, నమ్మకద్రోహం, నిందితులతో కుమ్మక్కవడం వంటి అంశాలపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం సుగాలి ప్రీతి కేసు విచారణ ఫైలుపై చేస్తానని పవన్ చెప్పారని, కానీ, ఇప్పుడు మాట మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

నేరం నిరూపణ అయ్యేందుకు తగిన ఆధారాలు, డీఎన్‌ఏ లేవని నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చేలా పవన్ మాట్లాడుతున్నారని పార్వతీ దేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం అడిగిన తనపై జనసేన కార్యకర్తలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారని షాకింగ్ ఆరోపణలు చేశారు.

2017లో కర్నూలులోని ఓ ప్రైవేట్ స్కూల్లో సుగాలి ప్రీతి అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. ప్రీతిని ఆ స్కూల్ కరెస్పాండెంట్ కుమారులు ఆమెపై అత్యాచారం చేసి చంపేశారని ఆమె తల్లిదండ్రులు 9 ఏళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. జగన్ హయాంలో ఈ కేసు గురించి ఎన్నో సార్లు వ్యాఖ్యలు చేసిన పవన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపకపోవడంతో పార్వతీ దేవి చివరకు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.

Tags
AP deputy CM Pawan Kalyan complaint on pawan sugali preethi
Recent Comments
Leave a Comment

Related News