గులాబీ శ్రేణుల్లో ఒక్కసారిగా ఆందోళన రేకెత్తించే వార్త ఇది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు(Kalvakuntla Himanshu Rao) ప్రమాదానికి గురయ్యారు. ఫిట్‌నెస్ విషయంలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హిమాన్షు .. జిమ్‌లో హెవీ వర్కవుట్స్ చేస్తున్న సమయంలో గాయపడినట్లు తెలుస్తోంది. వ్యాయామం చేస్తుండగా అదుపుతప్పి కిందపడటంతో ఆయన ముఖం, ముక్కు భాగానికి బలమైన దెబ్బ తగిలింది. దీంతో కుటుంబ సభ్యులు హిమాన్షును వెంటనే గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో హిమాన్షుకు చికిత్స అందుతోంది.
ఈ ఘటనపై కేటీఆర్(KTR) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అభిమానులు, కార్యకర్తలు కంగారు పడాల్సిన పని లేదని.. అది కేవలం చిన్న గాయమేనని, త్వరలోనే హిమాన్షు మామూలు స్థితికి వచ్చేస్తాడని ట్వీట్ చేశారు. అయితే కేటీఆర్ లైట్ తీసుకున్నప్పటికీ.. హిమాన్షును ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా జాయిన్ చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా చిన్న దెబ్బలైతే ఫస్ట్ ఎయిడ్ చేసి పంపేస్తుంటారు. కానీ ఆయన్ను ఏకంగా రెండు మూడు రోజుల పాటు బెడ్‌పైనే ఉంచి అబ్జర్వేషన్‌లో పెట్టాల్సి రావడం చూస్తుంటే గాయం తీవ్రత కాస్త ఎక్కువే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు హిమాన్షు ఆస్పత్రి పాలయ్యారనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బీఆర్ఎస్ క్యాడర్, కేటీఆర్ ఫాలోవర్స్ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఆయన త్వరగా రికవర్ అవ్వాలంటూ 'గెట్ వెల్ సూన్' మెసేజ్‌లు పెడుతున్నారు. కాగా, హాస్పిటల్ వద్ద ఎలాంటి హడావుడి, గందరగోళం లేకుండా ప్రైవసీని కాపాడుతున్నట్లు ఏఐజీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇక మనవడికి దెబ్బ తగిలిందనే సమాచారం అందుకున్న గులాబీ బాస్ కేసీఆర్(KCR).. ఫామ్‌హౌస్ నుంచి నేరుగా ఆస్పత్రికి వచ్చి హిమాన్షును పరామర్సించారు.