తెలుగు సినిమా పరిశ్రమలో ఒకప్పుడు రచయితగా ఒక వెలుగు వెలిగాడు పోసాని కృష్ణమురళి. ఏకంగా వంద సినిమాలకు పైగా ఆయన రైటర్‌గా పనిచేశారు. అందులో ఎన్నో హిట్లున్నాయి. తర్వాత దర్శకుడిగా, నటుడిగానూ ఆయన సత్తా చాటుకున్నారు. కానీ రాజకీయ రంగంలో మాత్రం ఆయనకు చేదు అనుభవం తప్పలేదు. గతంలో వేర్వేరు పార్టీల్లో పని చేసిన ఆయన.. చివరగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
కానీ ఆ పార్టీలో పని చేస్తున్న సమయంలో హద్దులు దాటి మాట్లాడిన ఫలితంగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన అరెస్టయి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆ కేసుల నుంచి బయటపడ్డాక పోసాని తీరు మారిపోయింది. ఇక తనకు రాజకీయాలు వద్దు అనేశారు. మళ్లీ సినిమాల వైపు చూశారు. స్వీయ దర్శకత్వంలో ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ అనే సినిమా తీశారు. ఈ చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
సడెన్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మీడియా ముందుకు వచ్చారు పోసాని. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. తాను గతంలో అరెస్టవడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ పోస్టర్లలో పోసాని చీరకట్టులో కనిపించారు. దీని గురించి యాంకర్ ప్రశ్నిస్తే.. తాను ఆడవాళ్ల చీరల గురించి, తాను సినిమాలో ధరించిన చీర గురించి ఏమీ మాట్లాడను అనేశారు.
ఆల్రెడీ తాను అరెస్టయి జైలుకు పోయానని, ఈ మధ్యే బయటికి వచ్చానని.. ఇప్పుడు మళ్లీ చీరల గురించి మాట్లాడి అరెస్టవ్వాలని అనుకోవట్లేదని పోసాని అన్నారు. ఇక ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. రైటర్‌గా తనకు వంద సినిమాల అనుభవం ఉందని.. దర్శకుడిగానూ ఏడు సినిమాలు తీశానని.. ఆ అనుభవంతో ఈ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రాయాలని ప్రయత్నించానని.. ఇది తన కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈ చిత్రంలో మిగతా నటీనటులందరూ కొత్తవాళ్లే.