కూటమికి 'స్థానిక' సవాల్.. త‌గ్గేదేలే అంటున్న ఆ 2 పార్టీలు.!

admin
Published by Admin — July 20, 2026 in Politics, Andhra
News Image

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ సీట్ల సర్దుబాటు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేసిన అధికార కూటమికి, ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక పెద్ద పరీక్షగా మారబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని పంచుకోవడమే లక్ష్యంగా టీడీపీ(TDP), జనసేన, బీజేపీ పార్టీలు ఒక తాటిపైకి వచ్చి విజయఢంకా మోగించాయి. కానీ, క్షేత్రస్థాయిలో పార్టీల ఉనికిని చాటుకునే స్థానిక పోరు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారుతోంది. గతంలో చూపించిన సర్దుబాటు ధోరణిని పక్కనబెట్టి, ఈసారి గట్టిగా పట్టుబట్టాలని మిత్రపక్షాలు భావిస్తుండటమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసినా.. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను బలోపేతం చేసుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలే సరైన వేదిక అని జనసేన, బీజేపీ గట్టిగా నమ్ముతున్నాయి. ముఖ్యంగా జనసేన(Janasena) నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఈ దిశగానే సాగాయి. పార్టీ నాయకులకు గుర్తింపు రావాలన్నా, గ్రామీణ స్థాయిలో జనసేన జెండా బలంగా ఎగరాలన్నా ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాల్సిందేననే వ్యూహంతో ఆ పార్టీ ఉంది. మరోవైపు బీజేపీ సైతం ఇదే దూకుడు ప్రదర్శిస్తోంది. ఉత్తరాంధ్రలో బీజేపీకి తిరుగులేని పట్టు ఉందని, ఇక్కడ రాజీ పడే ప్రసక్తే లేదని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు కూటమిలో కాక రేపుతున్నాయి. పార్టీ ఎదుగుదలకు ఈ ఎన్నికలను కొలమానంగా తీసుకోవాలని, సీట్ల విషయంలో వెనక్కి తగ్గొద్దని ఆయన క్యాడర్‌కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

అయితే  కూటమి ధర్మం దెబ్బతినకుండా, మూడు పార్టీలు కలిసికట్టుగా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrabau Naidu) భావిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ శ్రేణులను ఆయన నియంత్రిస్తూ, ఎక్కడా వివాదాలు రాకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, టీడీపీ నేతల నుంచి కూడా క్షేత్రస్థాయిలో తమ పట్టున్న స్థానాలను వదులుకోవద్దనే డిమాండ్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ, జనసేన పార్టీల్లో ఆశావహుల సంఖ్య భారీగా పెరగడం, పైగా పార్టీల విస్తరణకు ఇదొక సువర్ణావకాశం కావడంతో ఆ రెండు పార్టీల స్థానిక నేతలు తగ్గేదేలే అంటూ భీష్మించుకు కూర్చున్నారు.

అగ్ర నాయకత్వాలు ఎంత సఖ్యతగా ఉన్నా.. గ్రామ, మండల స్థాయికి వచ్చేసరికి రాజకీయాలు పూర్తిగా స్థానిక సమీకరణాలు, ఆధిపత్య పోరుపైనే నడుస్తాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక అత్యంత సంక్లిష్టంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. కూటమిలో ఎలాంటి చీలికలు రాకుండా, అసమ్మతి జ్వాలలు రగలకుండా దిగువ స్థాయి వరకు సమన్వయం కుదర్చడం ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ(BJP) పెద్దలకు ఒక పెద్ద సవాల్‌గా మారింది. మ‌రి స్థానిక సమరంలో ఈ మూడు పార్టీలు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తాయో చూడాలి.

Tags
AP Politics AP Local Elections AP Alliance TDP BJP Andhra Pradesh Janasena CM Chandrababu Naidu Pawan Kalyan
Recent Comments
Leave a Comment

Related News