గులాబీ బాస్‌కు షాక్.. మల్లారెడ్డి పార్టీ వీడ‌టం ఖాయ‌మా..?

admin
Published by Admin — July 20, 2026 in Politics, Telangana
News Image

తెలంగాణ రాజకీయాల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ముఖ్యంగా కొందరు నేతల వ్యవహారశైలి ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. ఈ లిస్ట్‌లో అందరికంటే ముందు వరుసలో ఉంటారు మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి(Malla Reddy). ఆయన ఏ వేదికపై ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా తనదైన పంథాతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీని ఆయన వీడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.

సాధారణంగా తన పార్టీ అధినేతను ఎవరైనా విమర్శిస్తే ఏ నాయకుడైనా తీవ్రంగా స్పందిస్తారు, లేదా కనీసం అక్కడి నుంచి నిరసనగా వెళ్ళిపోతారు. కానీ, తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌ను షేక్ చేస్తున్న ఓ తాజా దృశ్యంలో సీన్ పూర్తిగా భిన్నంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ వేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR)ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటే.. అదే వేదికపై సీఎంకు వెనుక వైపున కూర్చున్న మల్లారెడ్డి మాత్రం ఎలాంటి హావభావాలు లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. కనీసం ఆ కామెంట్స్‌ను ఖండించే ప్రయత్నం కూడా చేయకపోవడం రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

నిజానికి మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానంలో కేసీఆర్ పాత్ర చాలా కీలకం. టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన వెంటనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్‌తో పాటు కేబినెట్‌లో మంత్రి పదవి ఇచ్చి గులాబీ బాస్ సముచిత స్థానం కల్పించారు. అలాంటి కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి ఓ రేంజ్‌లో కౌంటర్ ఇస్తుంటే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి కూడా మల్లారెడ్డి మౌనం వహించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది. గతంలో రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి, మల్లారెడ్డికి మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉండేవి. అలాంటిది ఇప్పుడు రేవంత్ సమక్షంలోనే మల్లారెడ్డి అంత సైలెంట్‌గా ఉండటం వెనుక రాజకీయ సమీకరణాలు మారాయనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.

రాష్ట్రంలో బీఆర్ఎస్(BRS) అధికారం కోల్పోయినప్పటి నుంచి మల్లారెడ్డి పార్టీ మారుతారనే లీకులు వస్తూనే ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైపా? లేక రాష్ట్రంలో రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ వైపా? అనే సస్పెన్స్ నడుస్తోంది. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఆయన హస్తం గూటికి చేరడానికే మానసికంగా ఫిక్స్ అయ్యారనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్నాయి. 

Tags
Malla Reddy Revanth Reddy KCR BRS Congress Telangana Politics Medchal MLA TG Politics
Recent Comments
Leave a Comment

Related News