సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ లో బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీతో ఆయన భేటీ అయ్యారు. వీరిద్దరూ ఏపీతోపాటు దేశ రాజకీయాలపై చాలాసేపు చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం సాయం గురించి మోదీతో చంద్రబాబు మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆగస్ట్ 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ప్రధాని మోదీని చంద్రబాబు స్వయంగా ఆహ్వానించారు.
చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు కూడా ఉన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమని, దీని ప్రారంభోత్సవానికి తప్పక రావాలని వారు ప్రధానిని కోరారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.
ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. వారికి సహకరించేందుకు 26 మంది నాన్-క్యాడర్ అధికారులను కూడా నియమించారు. వీరంతా విజయనగరం జిల్లా కలెక్టర్‌కు రిపోర్ట్ చేస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. విజయనగరం జిల్లాలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్న ఈ 'అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం' ఉత్తరాంధ్ర ప్రాంతానికి మణిహారంగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు.