టాలీవుడ్ స్టార్స్‌కు వ‌రుస స‌ర్జ‌రీలు.. రీజ‌న్ అదేనా..?

admin
Published by Admin — July 28, 2026 in Movies
News Image

వెండితెరపై వారు చేసే సాహసాలు చూసి ఆడియెన్స్ ఈలలు వేస్తారు, థియేటర్లలో విజిల్స్‌తో హోరెత్తిస్తారు. కానీ, తెరవెనుక ఆ గ్లామర్ ప్రపంచం మోసే భారం, పడే శారీరక వేదన ఎవరికి తెలుసు? ఇప్పుడు టాలీవుడ్‌(Tollywood)లో సరిగ్గా ఇదే చర్చ నడుస్తోంది. ఇండస్ట్రీని ఏలుతున్న అగ్ర హీరోలు ఒకరి తర్వాత ఒకరు ఆసుపత్రి బాట పడుతుండటం అటు ఫిలింనగర్‌లో, ఇటు అభిమానుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది.

ఈ సర్జరీల పరంపరలో ముందుగా మెగాస్టార్ చిరంజీవి తన మోకాలి నొప్పితో ఇబ్బంది పడి వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన బాటలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా తీవ్రమైన వెన్నునొప్పి సమస్య కారణంగా ఆపరేషన్ చేయించుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ ఇటీవ‌ల  NBK111 షూటింగ్ లో గాయ‌ప‌డి మోకాలికి ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. 

కేవలం సీనియర్ హీరోలే కాకుండా యంగ్ జనరేషన్ స్టార్స్ కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) మణికట్టుకు గాయమైంది. ఆ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంగ‌ళ‌వారం కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో ఆయన విజయవంతంగా సర్జరీ చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్నారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఎడమ భుజానికి సంబంధించిన పాత గాయం మళ్లీ తిరగబెట్టడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన కూడా ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.

మొత్తానికి సినిమా సక్సెస్ కోసం, ఫ్యాన్స్‌(Fans)ను అలరించడం కోసం వీరు పడుతున్న తపన ప్రశంసనీయమే అయినా, ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. యాక్షన్ సీన్లలో డూప్‌ల సహాయం తీసుకోకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా హీరోలు స్వయంగా స్టంట్లు చేయడం, నిరంతర షూటింగ్‌లతో శరీరంపై ఒత్తిడి పెంచుకోవడం, ఏళ్ల తరబడి పడిన పాత గాయాలు మళ్లీ తిరగబెట్టడమే ఈ అనారోగ్యాలకు అసలు కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. ఏదేమైనా, ఈ ఇబ్బందులన్నీ తాత్కాలికమేనని, అందరూ పూర్తిగా కోలుకుని సరికొత్త జోరుతో మళ్ళీ సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.

Tags
Tollywood Chiranjeevi Pawan Kalyan Nandamuri Balakrishna Ram Charan Jr NTR Telugu Cinema
Recent Comments
Leave a Comment

Related News