ఏపీలో బ‌న్నీ బిగ్ స్టెప్‌.. మిగ‌తా స్టార్స్‌కు ఆ ద‌మ్ము లేదా?

admin
Published by Admin — August 03, 2026 in Andhra, Movies
News Image

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమను విస్తరించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇండస్ట్రీని ఏపీ వైపు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. కానీ టాలీవుడ్ ప్రముఖుల నుంచి మాత్రం కనీస స్పందన కరువైంది.

ఎప్పుడూ బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు, నంది అవార్డుల ప్రదానోత్సవాల గురించిన చర్చలే తప్ప, ఆంధ్రాలో కనీసం షూటింగ్‌లు చేయాలనే ఆలోచన కూడా పెద్దగా ఎవరికీ రావడం లేదు. సరిగ్గా ఇదే సమయంలో, మిగతా స్టార్ హీరోలకు భిన్నంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

రాజకీయంగా కొన్ని చర్చల్లో వినిపించినప్పటికీ, ఏపీ(AP)లోని విశాఖపట్నంలో అల్లు అర్జున్ తన ఏఏఏ (ఏసియన్ అల్లు అర్జున్ సినిమాస్) మల్టీప్లెక్స్‌ను ఏర్పాటు చేసి పెద్ద సాహసమే చేశారు. విశాఖలోని ప్రసిద్ధ 'ఇనార్బిట్ మాల్‌లో' ఏకంగా 8 స్క్రీన్‌లతో ఈ అత్యాధునిక సినిమా హాల్ రూపుదిద్దుకుంది. ఈ నెల 9నే అల్లు అర్జున్ స్వయంగా దీనిని ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌(Hyderabad)లోని అమీర్‌పేటలో ఉన్న ఏఏఏ మల్టీప్లెక్స్ ఏ స్థాయిలో అయితే హై-ఎండ్ టెక్నాలజీతో ఉందో, విశాఖ ప్రాజెక్ట్ కూడా అదే రేంజ్‌లో ఉంది. భారీ స్క్రీన్లు, అత్యాధునిక లేజర్ ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్‌తో పాటు ప్రీమియం ఫుడ్ కోర్టులు, ప్రత్యేక డిజైనర్ లాంజ్‌లు ఇక్కడ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

మిగతా టాలీవుడ్(Tollywood) హీరోలందరూ కేవలం హైదరాబాద్‌కే పరిమితమవుతుంటే, బన్నీ మాత్రం విశాఖను టార్గెట్ చేస్తూ తీసుకున్న ఈ బిగ్ స్టెప్ నిజంగా అభినందించదగ్గది. మరి అల్లు అర్జున్ చూపిన ఈ స్పూర్తితోనైనా మిగతా టాలీవుడ్ ప్రముఖులు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారేమో చూడాలి.

Tags
Allu Arjun AAA Cinemas Vizag Inorbit Mall Vizag Tollywood Icon Star Andhra Pradesh
Recent Comments
Leave a Comment

Related News