రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు సహజమే కానీ, తాము అధికారంలో ఉన్న ఐదేళ్లూ ఏ పనీ చేయకుండా బటన్ల పాలనకే పరిమితమైపోయి, ఇప్పుడు అవతలి వాళ్ళు కడుతుంటే మావంటే మావంటూ ఓనర్షిప్ బోర్డులు మార్చేయడం ఒక్క వైసీపీ(YCP)కే చెల్లింది. పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఇప్పుడు ఆ పార్టీ నేతలు ఆడుతున్న డ్రామాలు చూస్తుంటే సామాన్యులకు కూడా నవ్వు వస్తోంది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనైనా ముందుకు కదలిందా అంటే అందరి నుంచి వచ్చే సమాధానం 'సున్నా' అనే. ముఖ్యంగా జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును అధికారంలోకి రాగానే రివర్స్ టెండరింగ్ పేరుతో గాలికొదిలేశారు. అప్పట్లో నీటిపారుదల శాఖను నిర్వహించిన మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అయితే డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందంటూ నిస్సహాయత వ్యక్తం చేస్తూ కామెడీ షోలు నడిపించారు. పోలవరం ఒక బ్రహ్మ పదార్థమని, అసలు నాకే అర్థం కాలేదంటూ చేతులెత్తేశారు. ఐదేళ్ల పాటు గుంతలు కూడా పూడ్చని ఆ ప్రభుత్వం, ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో కేవలం బటన్‌లు నొక్కడమే పరమావధిగా పెట్టుకుంది.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) చొరవతో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులకు మళ్లీ ఊపిరి వచ్చింది. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి, రాబోయే కాలంలోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని స్పష్టమైన డెడ్‌లైన్లు ప్రకటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేళ భోగాపురం, పోలవరం, అమరావతి నిర్మాణాలపై కూటమి సర్కార్ స్పష్టమైన ప్రణాళికలు బయటపెట్టడంతో వైసీపీలో గుబులు మొదలైంది.
ఇక అక్కడే అసలు నాటకం తెరపైకి వచ్చింది. ఎక్కడ తమ వైఫల్యాలు బయటపడతాయోనని భయపడిన వైసీపీ సోషల్ మీడియా, వెంటనే రంగంలోకి దిగి ఓవర్ యాక్షన్ స్టార్ట్ చేసింది. "పోలవరం ప్రాజెక్టు తిరుగులేని స్థితికి చేరిందంటే అది వైఎస్ జగన్(Jagan) చొరవే" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. తాము అధికారంలో ఉన్న ఐదేళ్లు ప్రాజెక్టును సర్వనాశనం చేసి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కష్టపడి తెస్తున్న ఫలితాలను తమ ఖాతాలో వేసుకునేందుకు పడుతున్న పాట్లు చూస్తుంటే విచిత్రంగా ఉంది.
అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా రాజధాని కట్టొద్దని, ప్రాజెక్టులు నిర్మించొద్దని ప్రజలెవరైనా అడ్డుకున్నారా? పరిశ్రమలు తెవద్దన్నారా? ఏదీ లేదు. కేవలం చేతకానితనం, పరిపాలనలో అనుభవలేమి కారణంగానే రాష్ట్రం తిరోగమనంలో నడిచింది. ఆఖరికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే విసిగిపోయి బయటకు వెళ్లే పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇప్పుడు పనులు వేగవంతం అవుతుంటే "మేమే కట్టాం" అని చెప్పుకోవడం చూస్తుంటే.. భవిష్యత్తులో తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నట్లే అమరావతి(Amaravati)ని కూడా మేమే నిర్మించామన్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.