రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక్క చర్చ నడుస్తోంది. అదే ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన. కూటమి ప్రభుత్వం కొలువుదీరి సమయం గడిచిపోతున్న కొద్దీ, పాలనా యంత్రాంగంపై పట్టు బిగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే కేబినెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయనే ప్రచారం జోరందుకుంది.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంలోనూ, ప్రజల్లోకి దూసుకుపోవడంలోనూ కొందరు మంత్రుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఫైళ్ల క్లియరెన్స్‌లో వేగం తగ్గడం, విధానపరమైన నిర్ణయాలపై అనుకున్నంత స్పష్టత లేకపోవడం, ప్రధానంగా ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కొందరు మంత్రులు(Ministers) పూర్తిగా వెనుకబడ్డారనే విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు స్వయంగా కొందరి పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో బలంగా చర్చ జరుగుతోంది.
రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం కేబినెట్(Cabibet)లో ఉన్న ఆ ఐదుగురు మంత్రులపై వేటు పడటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. వారి స్థానంలో పార్టీకి విధేయులుగా ఉంటూ, దూకుడుగా వ్యవహరించే సీనియర్ నేతలకు, యువ నాయకులకు అవకాశం కల్పించేలా అధిష్టానం కసరత్తు చేస్తోందని సమాచారం.
మొత్తానికి, రాబోయే పరిణామాలు ఏపీ(AP) రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. పనితీరు ఆధారంగానే మంత్రుల భవిష్యత్తు ఉంటుందనే స్పష్టమైన సందేశాన్ని చంద్రబాబు ఇస్తుండటంతో, ఎవరికి ఉద్వాసన పలుకుతారు? కొత్తగా ఎవరికి బెర్త్ దక్కుతుంది? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.