గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన.. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం సహా.. ఇతర డిజిటల్ పేమెంట్స్‌పై చార్జీల వసూలు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైలెంట్‌గా తన పనికానిచ్చేసిం ది. తాజాగా దీనికి సంబంధించిన యూనిఫైడ్ చెల్లింపుల బిల్లు-2026కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. నిజానికి దీనిపై చర్చ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. కానీ.. విపక్షాలు ఢిల్లీ నిరసనల్లో పోలీసుల లాఠీ చార్జీపై చర్చ కు పట్టుబట్టడంతో కేంద్రం ఏకపక్షంగా ఈ బిల్లును ఆమోదించేసింది.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్‌సభలో గురువారం సాయంత్రం ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. అనంతరం.. విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాల మధ్యే `వాయిస్ ఓటు` ద్వారా ఈ బిల్లును ఆమోదించడం గమనార్హం. అనంతరం.. స్పీకర్ ఓం బిర్లా సదరు బిల్లు ఆమోదం పొందిందని పేర్కొన్నారు. తర్వాత.. సభను వాయిదా వేశారు. వాస్తవానికి ఇది అత్యంత కీలకమైన బిల్లు అని.. నిపుణు లు సైతం వ్యాఖ్యానించారు. దీనిపై చర్చ జరగాలని యావత్ దేశం కోరుకుంది. కానీ, ఎలాంటి చర్చ లేకుండా సైలెంట్‌గా బాదేశారు.
బ్యాంకులకు విస్తృత అధికారాలు!
వినియోగదారులపై చార్జీలు మోపే విషయంలో ఇప్పటికే విస్తృతమైన అధికారాలు సొంతం చేసుకున్న బ్యాంకులు.. క్రెడిట్ కార్డుల నుంచి సందేశాలు పంపే వరకు, డెబిట్ కార్డుల నుంచి చెక్ బుక్కుల వరకు.. మినిమం బ్యాలెన్స్ దాకా.. అనేక రూపాల్లో అదనపు రుసుములు బాదేస్తున్నాయి. ఇక, గృహ, వాహన రుణాలపై ఆర్బీఐ నిర్ణయించిన వడ్డీలతోపాటు.. బ్యాంకులు కూడా సొంతంగా 50 పైసల వరకు వడ్డీని విధించే వెసులుబాటు కల్పించారు. ఇవన్నీ.. ఒక ఎత్తయితే.. ఇప్పుడు మరో ఆయుధాన్ని అందించారు.
యూనిఫైడ్ బిల్లు-2026 ద్వారా బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు.. విస్తృతమైన అధికారం లభించింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, నమో భారత్, అమెజాన్ పే వంటి పలు యాప్‌ల ద్వారా ప్రస్తుతం జరుగుతున్న నగదు లావాదేవీలపై బ్యాంకులు రుసుములు విధించే అవకాశం కల్పించారు. దీనిలో ప్రభుత్వం జోక్యం ఉండబోదని బిల్లులో పేర్కొన్నారు. తద్వారా బ్యాంకులు ఇష్టారాజ్యంగా వసూలు చేసిన అడిగే వారు లేకుండా పోతారా? అనేది సందేహం. మరోవైపు.. ఆర్బీఐ ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని చెప్పిన 24 గంటల్లోనే కేంద్రం బిల్లును ఆమోదించేయడం గమనార్హం. అయితే.. నగదు లావాదేవీల పరిమితి లక్షకు మించితేనే రుసుము వసూలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.