రాజకీయాల్లో శబ్దం ఎక్కువ చేస్తేనే లీడర్ అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు ట్రెండ్ మారింది.. సైలెంట్‌గా ఉంటూనే గ్రౌండ్ రియాల్టీని మార్చేయడం సరికొత్త పద్ధతి అయింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం ఇదే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. బయటకు ఎలాంటి ఆర్భాటం లేకుండా, ప్రతిరోజూ మీడియా ముందు ప్రత్యర్థులపై విమర్శల దాడి చేయకుండా ఆయన నడిపిస్తున్న రాజకీయ శైలి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఒకవైపు మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు పార్టీని క్షేత్రస్థాయిలో ఉక్కులా మలచడమే లక్ష్యంగా పవన్ పావులు కదుపుతున్నారు. పంచాయతీ రాజ్, అటవీ శాఖల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు, గిరిజనులకు నేరుగా ప్రయోజనాలు చేకూర్చే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అడవి తల్లి బాట పేరుతో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కావచ్చు, అనకాపల్లి(Anakapalli) జిల్లా పంచదార్ల వద్ద అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేస్తూ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు.. ఇవన్నీ ఆయన మాటల్లో కంటే చేతల్లో పవర్ ఏంటో నిరూపిస్తున్నాయి.
ఇక పార్టీ నిర్మాణం విషయంలో పవన్ అనుసరిస్తున్న తీరు మరింత ఆసక్తికరంగా ఉంది. బూత్ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేయడమే ప్రథమ కర్తవ్యంగా ఆయన భావిస్తున్నారు. ఏళ్ల తరబడి కష్టపడిన నిజమైన సైనికులకే భవిష్యత్తులోనూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్దపీట వేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరగదనే భరోసా కల్పిస్తూ క్యాడర్‌లో నూతనోత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ టీవీల్లో చర్చల కోసం ప్రత్యర్థులను విమర్శించడం వల్ల గ్రౌండ్ లెవెల్ లో ఒరిగేదేమీ లేదని పవన్(Pawan) ముందే గ్రహించారు. అందుకే అనవసరపు మాటల యుద్ధానికి దూరంగా ఉంటూ, కేవలం నిర్మాణాత్మక రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ మౌన పోరాటం వెనుక అసలు మాస్టర్ ప్లాన్ 2029 ఎన్నికలే. నాటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా అత్యధిక స్థానాలు డిమాండ్ చేయాలన్నా, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలన్నా ముందుగా పార్టీ సొంత కాళ్లపై పటిష్టంగా నిలబడాలని జనసేన(Janasena) అధినాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. 2024లో చూపిన సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్‌ను భవిష్యత్తులోనూ పునరావృతం చేయడమే టార్గెట్‌గా సాగుతున్న ఈ సైలెంట్ గేమ్.. ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలన మార్పులకు నాంది పలుతుందో వేచి చూడాలి.