ఈ నెలలోనే తాను కొత్త పార్టీపై ప్రకటన చేస్తానని రాజ్యసభ మాజీ సభ్యుడు, వైసీపీ మాజీ నాయకుడు వేణుంబాకం విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రజల కోసం-ప్రజల చేత-ప్రజల వలన.. అనే సూత్రాన్ని తూచ. తప్పకుండా పాటిస్తామన్నారు. ప్రజల గళానికి తాము గొంతుకగా మారుతామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నెలలోనే పార్టీకిసంబంధించిన ప్రకటన ఉంటుందని.. విధివిధానాలను కూడా రూపొందిస్తున్నామని చెప్పారు.
బుధవారం సతీమణితో కలిసి సాయిరెడ్డి తిరుమల శ్రీవారిని దక్కించుకున్నారు. అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. గత కొన్ని రోజులుగా పార్టీ ఏర్పాటుపై కొందరు మిత్రుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ప్రజలకు మరో పార్టీ అవసరం అన్నది అక్షర సత్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల తరఫున పోరాడే పార్టీలు ఇప్పుడు లేవని ఆయన విమర్శించారు. అంతేకాదు.. కులాల ఆధారంగా పార్టీలు విడిపోతున్నాయని వ్యాఖ్యానించారు.
కొత్త పార్టీ పెట్టేందుకు ధైర్యం, డబ్బుతో పనిలేదన్న సాయిరెడ్డి ప్రజల మద్దతు ఉంటే చాలని అన్నారు. ఓ పార్టీలో(వైసీపీ పేరు ఎత్తకుండా) ఉన్నప్పుడు.. తాను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించానని.. అప్పట్లోనే ప్రజల కష్టాలు తెలుసుకున్నానని చెప్పారు. అయితే.. కొత్తగా పార్టీ పెట్టిన తర్వాత.. తానేమీ పాదయాత్ర లు వంటివి చేయబోనని చెప్పారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు ఈ రోజు అనేక మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వాటిని వినియోగించుకుంటానన్నారు.
జెన్‌జీపై ..
జెన్‌జీపైనా సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం యువతకు ప్రాతినిధ్యం తగ్గిపోతోందన్నారు. రాజకీయాల్లో యువత పేరుతో వారసులు వస్తున్నారని.. దీంతో క్షేత్రస్థాయిలో గ్యాప్ ఎక్కువగా ఉందన్నా రు. ఈ గ్యాప్‌ను తాము పూర్తి చేస్తామన్నారు. యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులు రాజకీయాల్లోకి రావడం సరైన నిర్ణయమని చెప్పారు. రాజకీయాల్లోనూ ఉపాధి ఉంటుందని తెలిపారు. అయితే.. వ్యక్తిగత అవసరాలకు కాకుండా.. ప్రజలకు ఉపయోగపడేలా రాజకీయాలు చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు.