మార్కాపురం.. వారికి `రిమార్క్‌`పురం.. !

admin
Published by Admin — August 25, 2026 in Politics, Andhra
News Image

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ఒక‌ప్పుడు కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గంగా ఉన్న మార్కాపురం( Markapuram) ప్ర‌స్తుతం జిల్లా అయిం ది. ఇత‌ర ప్రాంతాల‌ను క‌లుపుతూ.. కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు వైసీపీకి చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. జిల్లా ఏర్పాటు అంశం ఒకానొక‌దశ‌లో ఇక్క‌డ ప్ర‌ధాన సెంటిమెంటుగా మారింది. దీనిని ప‌రిష్క‌రించాల‌ని వైసీపీ నేత‌లు.. అధిష్టానంపై అధికారంలో ఉన్న‌ప్పుడే హిత‌వు ప‌లికారు. ప్ర‌జ‌ల సెంటిమెంటును గౌర‌వించాల‌ని కోరారు.

కానీ, నాడు ప‌ట్టించుకోని వైసీపీ.. ఇప్పుడు కూట‌మి వ‌చ్చాక ప్ర‌త్యేక జిల్లా ఏర్పాటు చేసిన త‌ర్వాత‌.. ఇక్క‌డి రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టాల‌ని ప్ర‌య‌త్నించింది. కానీ, అనుకున్న విధంగా ఇక్క‌డ ఆశ‌లు ఫ‌లించ‌డం లేదు. పైగా.. నాయ‌కులు కూడా పార్టీకి అంటీముట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గం మార్కాపుంలో టీడీపీకి ప్ర‌స్తుత ఎమ్మెల్యే కందుల నారాయ‌ణ రెడ్డి(Kandula Narayana Reddy) బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. ప్ర‌స్తుత ప‌రిణామాలను పూర్తిగా  సానుకూలం చేసుకున్నారు. జిల్లా ఏర్పాటును త‌న ఖాతాలో వేసుకున్నారు.

కందుల వ‌ల్లే నియోజ‌క‌వ‌ర్గం కాస్తా.. జిల్లా అయింద‌న్న వాద‌న ప్ర‌జ‌ల్లో బ‌లంగా వినిపిస్తోంది. దీనికి తోడు.. వెలిగొండ ప్రాజెక్టు పూర్త‌వుతున్న నేప‌థ్యం కూడా ఎమ్మెల్యేకు క‌లిసి వ‌స్తోంది. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఆయ‌న అందుబాటులో ఉండ‌డ‌మే కాదు.. వారి స‌మ‌స్య‌ల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వెలిగొండ నిర్వాసితుల‌కు ఆప‌న్న‌హ‌స్తం అందించ‌డంలోనూ ముందున్నారు. ఇక‌, వైసీపీ(YCP) విష‌యానికి వ‌స్తే.. ప్ర‌తి ఎన్నిక‌లోనూ మారుతున్న నాయకుల కార‌ణంగా స్థిర‌మైన రాజ‌కీయ వ్యూహాలు చేయ‌డం లేదు.

2014లో జంకే వెంక‌ట‌రెడ్డి, 2019లో నాగార్జున రెడ్డి,.. వైసీపీ త‌ర‌ఫున గెలిచినా.. బ‌ల‌మైన ముద్ర వేయ‌లేక పోయారు. ముఖ్యంగా రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని ఆక‌ర్షించ‌డంలోనూ విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ఎన్నో ఆశ‌ల‌తో 2024లో అన్నా రాంబాబును చేర‌దీసిన వైసీపీ ఆయ‌న‌కు టికెట్ ఇచ్చింది. కానీ, ఆయ‌న ఓట‌మి త‌ర్వాత‌.. ఐపు లేకుండా పోయారు. పార్టీ త‌ర‌ఫున వాయిస్ కూడా లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు మార్కాపు రంలో టీడీపీ(TDP) ఓ వెలుగు వెలుగుతుండ‌గా.. వైసీపీ మాత్రం రిమార్కు రాజ‌కీయాల‌తో సొంత గూటిలోనే పోరాటం చేసే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

Tags
Markapur Politics YSRCP TDP MLA Kandula Narayana Reddy Markapuram District Andhra Pradesh Ap News
Recent Comments
Leave a Comment

Related News