కర్ణాటక(Karnataka)లో చోటు చేసుకున్న ఒక సంచలన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికార దర్పం ఏ స్థాయిలో ప్రదర్శితమవుతుందనేదానికి నిదర్శనంగా నిలిచింది తాజా ఉదంతం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ప్రముఖ శ్రీ రంగపట్నం పరిధిలోని ఆరతి ఉక్కడ ఆలయం భీమ అమావాస్య వేడుకలతో కిటకిటలాడుతోంది. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణమంతా రద్దీగా మారడంతో, సాధారణ భక్తులవలె అందరూ క్యూ లైన్లలో నిలబడి దైవ దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో, బందోబస్తు విధుల్లో ఉన్న మాండ్య మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై సావితా పాటిల్ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
అక్కడికి వచ్చిన తూముకూరు రూరల్ ఎమ్మెల్యే బీ.ఎస్. సురేష్ గౌడ(MLA BS Suresh Gowda) కుమార్తె ఐశ్వర్య.. నిబంధనలను పక్కన పెట్టి నేరుగా గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. రద్దీ ఎక్కువగా ఉండటం, భక్తులు క్యూలో వేచి చూస్తుండటంతో విధుల్లో ఉన్న ఎస్సై సావితా పాటిల్ ఆమెను సున్నితంగా వారించారు. "అందరిలాగే కొద్దిసేపు వేచి చూడండి" అని సూచించారు. అయితే, ఈ మాటలను జీర్ణించుకోలేకపోయిన ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య ఒక్కసారిగా రెచ్చిపోయారు. "నేను ఎమ్మెల్యే కూతురిని, నన్నే అడ్డుకుంటావా?" అంటూ సిబ్బందిపై విరుచుకుపడ్డారు.
మాట మాటా పెరిగి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్య(Aishwarya) ఏకంగా మహిళా ఎస్సై చెంప చెళ్లుమనిపించారు. విధుల్లో ఉండి తనపైనే భౌతిక దాడికి దిగడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్సై సావితా పాటిల్ కూడా దీటుగా స్పందించారు. అక్కడున్న భక్తులు వారిని వారించేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.
విధుల్లో ఉన్న తనను దుర్భాషలాడి, చేయి చేసుకున్న ఘటనపై ఎస్సై సావితా పాటిల్(SI Savita Patil) కైతనహళ్లి పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. మరోవైపు, తన కూతురిని ఉద్దేశపూర్వకంగానే అడ్డుకున్నారని, తమను కిందిస్థాయి సిబ్బంది వేధించారని ఎమ్మెల్యే సురేష్ గౌడ ఆరోపిస్తున్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించిన అసలు వీడియో క్లిప్స్ ఇప్పుడు బయటకు రావడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దేవుడి సన్నిధిలోనూ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల ఈ బరితెగింపు చర్యలపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.