"ఇన్నోవా కారు ఇస్తేనే ఆమె కొడుక్కి ఫీలింగ్స్ వస్తాయట.." మాజీ మంత్రి జోగి రమేష్(Jogi Ramesh) కోడలు మేఘన చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎప్పుడూ తెరవెనుక ఉండే రాజకీయ కుటుంబాల వ్యక్తిగత దూషణలు, వివాదాలు ఒక్కసారిగా బట్టబయలు కావడంతో ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేఘన(Meghana) కన్నీటి పర్యంతమవుతూ తన బాధలను బయటపెట్టారు. తన జీవితంలో ఊహించని కష్టాలు ఎదురయ్యాయని, అయితే అన్యాయంపై ధైర్యంగా గళం విప్పేందుకు ముందుకు వచ్చానని ఆమె స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో ఒక ఉన్నత కుటుంబానికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేశారని, కానీ తమ జీవితంతో ఆడుకున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దంపతుల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నాయని జోగి రమేష్ చేసిన వాదనలను మేఘన తీవ్రంగా ఖండించారు. తమ మధ్య ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవని, అసలు సమస్య భర్త రాజీవ్(Jogi Rajeev)లోని లోపమేనని ఆమె కుండబద్దలు కొట్టారు. ఈ విషయాన్ని బయటపడకుండా దాచిపెట్టి, అనవసరంగా ఈ వివాదానికి రాజకీయా రంగు పులిరే ప్రయత్నం చేస్తున్నందుకే తాను మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. పెళ్లయిన నాటి నుంచే అదనపు కట్నం కోసం వేధింపులు ప్రారంభమయ్యాయని, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇన్నోవా కారు కావాలని అత్త శకుంతల డిమాండ్ చేశారని ఆమె వాపోయారు. "నువ్వు డబ్బులు తీసుకురా, కారు తీసుకురా.. అప్పుడే వాడికి నీపై ఫీలింగ్స్ వస్తాయి" అంటూ అత్తగారు మాట్లాడిన మాటలను గుర్తుచేసుకుంటూ మేఘన ఎమోషనల్ అయ్యారు.
మరోవైపు, ఈ పెళ్లి విషయంలో తమను పూర్తిగా మోసం చేశారని మేఘన ఆరోపించారు. పెళ్లికి ముందు తమది హిందూ కుటుంబమని నమ్మించారని, కానీ ఆ తర్వాత అసలు విషయం బయటపడిందని ఆమె చెప్పారు. ఇంట్లో కనీసం పూజలు చేసుకునే పరిస్థితి కూడా లేదని, తాము పూజలు చేస్తుంటే అత్తగారు హిందూ దేవుళ్లను అసహ్యించుకుంటూ తీవ్రంగా అవమానించేవారని ఆమె పేర్కొన్నారు. ఇటీవల జోగి రమేష్ మాట్లాడుతూ, కోడలిని కన్నకూతురిలా చూసుకుంటూ గోరుముద్దలు తినిపించామని చెప్పడంపై మేఘన ఘాటుగా స్పందించారు. నిజంగానే అంత ప్రేమగా చూసుకుని ఉంటే తనకు ఇన్ని కష్టాలు, అణచివేత ఎందుకు ఎదురవుతాయని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఇక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(MLA Vasantha Krishna Prasad) నివాసానికి తాము వెళ్లిన వీడియోలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ... ఒక ప్రజాప్రతినిధిగా తనకు న్యాయం చేయమని కోరడానికే అక్కడకి వెళ్లామని, ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం మేఘన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఈ వివాదంపై జోగి రమేష్ కుటుంబం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.