ఇప్పుడు జైలు టికెట్లు బుక్‌మైషోలో.. రూ. 500 ఇస్తే చాలు..!

admin
Published by Admin — August 25, 2026 in Telangana
News Image

సినిమా టికెట్లు, థీమ్ పార్క్ ఎంట్రీ పాస్‌లు బుక్ చేసుకోవడానికి నిత్యం ఉపయోగించే 'బుక్‌మైషో' యాప్‌లో ఇప్పుడు సరికొత్తగా జైలు టికెట్లు దర్శనమిస్తున్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వంద శాతం నిజం. ఏ పీడీఎఫ్ సినిమా టికెట్‌కో కాదు, ఏకంగా అసలు సిసలు జైలు గదిలో గడిపేందుకు ఈ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. క్రైమ్ చేయకుండానే కటకటాల వెనక్కి వెళ్లే ఈ వినూత్న అవకాశాన్ని తెలంగాణ(Telangana) జైళ్ల శాఖ ప్రజల ముందుకు తీసుకువచ్చింది.

హైదరాబాద్‌లోని సుదీర్ఘ చరిత్ర కలిగిన చంచల్‌గూడ జైలు(Chanchalguda Jail) వేదికగా ఈ ప్రత్యేక కార్యక్రమం రూపుదిద్దుకుంది. జైలు వాతావరణం ఎలా ఉంటుంది? అక్కడ ఖైదీల దినచర్య ఏ విధంగా సాగుతుంది? సంస్కరణలు ఏ స్థాయిలో అమలవుతున్నాయి? లాంటి ఆసక్తికరమైన విషయాలను సామాన్యులకు ప్రత్యక్షంగా అనుభవంలోకి తెచ్చేందుకే అధికారులు 'తెలంగాణ జైల్ ఎక్స్‌పీరియన్స్' పేరిట ఈ ప్రాజెక్ట్‌ను రన్ చేస్తున్నారు.

ఈ విలక్షణ అనుభూతిని పొందాలనుకునే వారికి జైలు(Jail) అధికారులు పక్కా ప్లాన్ సిద్ధం చేశారు. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఓ ఖైదీ ఎలాంటి జీవనం గడుపుతాడో వీరికి అదే దినచర్య ఉంటుంది. ఉదయం 6 గంటలకే నిద్రలేచి యోగా, వ్యాయామం చేయడం, పరేడ్‌లో పాల్గొనడం, టైలరింగ్ లేదా వ్యవసాయం వంటి పనులు చేయడం ఇందులో భాగం. అంతేకాదు, మొబైల్ ఫోన్లు వంటి డిజిటల్ గ్యాడ్జెట్లన్నీ ముందే గేటు బయట పెట్టేయాలి. ఖైదీలకు ఇచ్చే సాధారణ యూనిఫాం ధరించి, స్టీల్ ప్లేట్, గ్లాసుల్లోనే భోజనం చేయాల్సి ఉంటుంది.

ఈ విడతలో భాగంగా ఆగస్ట్ 25 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంది. 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఇందులో భాగం కావచ్ఛు. ఇందుకోసం కాల వ్యవధిని బట్టి వేర్వేరు ధరలను నిర్ణయించారు. కేవలం 4 గంటల అనుభవం కోసం రూ. 500 చెల్లించాల్సి ఉండగా.. 8 గంటలకు రూ. 750, 12 గంటలకు రూ. 1,000గా ఉంది. ఇక పూర్తి స్థాయిలో 24 గంటలు జైలు జీవితాన్ని అనుభవించాలనుకుంటే రూ. 1,500 చెల్లించి ప్రత్యేక బ్యారక్‌లలో బస చేయవచ్చు. సాధారణంగా సినిమాల్లో జైలు సీన్లు చూసి ఆశ్చర్యపోతుంటాం. కానీ, ఎటువంటి తప్పు చేయకుండా, ఎలాంటి భయం లేకుండా స్వచ్ఛందంగా వెళ్లి ఆ రియల్ లైఫ్ ప్రిజన్ వైబ్స్‌ను టేస్ట్ చేయాలని ఉంటే మాత్రం.. వెంటనే మీ ఫోన్ ఓపెన్ చేసి బుక్‌మైషో(Book My Show)లో మీ స్లాట్ బుక్ చేసుకోండి మరి.

Tags
Jail Experience Chanchalguda Jail Hyderabad Book My Show Prison Telangana Police Telangana
Recent Comments
Leave a Comment

Related News