గుడివాడ‌లో కొడాలికి అసలు సిసలు సవాల్..!

admin
Published by Admin — August 31, 2026 in Politics, Andhra
News Image

దశాబ్దాల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాలను తనదైన శైలిలో శాసించిన మాజీ మంత్రి, వైసీపీ(YCP) సీనియర్ నేత కొడాలి నాని ముందు ఇప్పుడు సరికొత్త సవాల్ వచ్చిపడింది. రెండు దేడాబ్దాలుగా గుడివాడ కోటను తన గుప్పిట్లో ఉంచుకున్న ఆయనకు, గత సార్వత్రిక ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదురైంది. రాజకీయాల్లో ఇక రిటైర్మెంట్ తీసుకోవచ్చన్న ప్రచారం జరిగిన వేళ.. ఆయన మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు పావులు కదుపుతున్నారు. అయితే, ఈసారి ఆయన రాజకీయ భవితవ్యాన్ని తేల్చేది సాధారణ ఎన్నికలు కావు.. గుడివాడలో జరగబోయే మునిసిపల్ పోరే!

గతంలో గుడివాడ(Gudivada) మునిసిపాలిటీని వరుసగా రెండుసార్లు కైవసం చేసుకోవడంలో కొడాలి నాని వ్యూహమే ప్రధానం. అప్పట్లో ఆయన నమ్ముకున్న యలవర్తి శ్రీనివాసరావు లాంటి కీలక నేతలను తెరపైకి తెచ్చి చైర్మన్ పీఠం దక్కించుకున్నారు. కానీ, కాలం మారుతున్న కొద్దీ సమీకరణాలు తలకిందులయ్యాయి. అధికార మార్పిడితో పాటు, గతంలో కొడాలికి కుడిభుజంగా ఉన్న నేతలే ఇప్పుడు పచ్చ కండువా కప్పుకుని టీడీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో సొంత గడ్డపై నానిని ఒంటరి చేసేందుకు ప్రత్యర్థులు ప్లాన్ చేస్తున్నారు.

మరోవైపు, గుడివాడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము(MLA Venigandla Ramu) దూకుడు పెంచారు. ఎన్నారై నిధులతో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు, స్థానిక కేడర్‌ను బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీ శిబిరంలో గుబులు పుట్టిస్తున్నాయి. అంతేకాదు, గుడివాడ వైసీపీలోనూ కాపు సామాజిక వర్గం నుంచి వస్తున్న కొత్త డిమాండ్లు కొడాలికి తలనొప్పిగా మారాయి.

ఒకవైపు బలమైన ప్రత్యర్థి వ్యూహాలు, మరోవైపు సొంత పార్టీలో మారుతున్న సమీకరణాల మధ్య కొడాలి నాని(Kodali Nani) తన సత్తా నిరూపించుకోవాల్సి ఉంది. గుడివాడ పీఠంపై తన పట్టు ఇంకా చెక్కుచెదరలేదని నిరూపించుకోవడానికి ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? స్థానిక పోరులో గెలిచి నాని మళ్ళీ తన పూర్వవైభవాన్ని దక్కించుకుంటారా? లేక ప్రత్యర్థుల వ్యూహాలెత్తులకు గుడివాడ రాజకీయం మరోసారి మలుపు తిరుగుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

Tags
Kodali Nani Gudivada Politics Andhra Pradesh AP Politics AP Local Elections TDP YSRCP Venigandla Ramu
Recent Comments
Leave a Comment

Related News