అల్లు vs యశ్.. వివాదం ఒక‌టైతే, లొల్లి ఇంకొక‌టి..!

admin
Published by Admin — August 31, 2026 in Movies
News Image

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ అంశాలు రచ్చ లేపుతాయో ఎవరూ ఊహించలేరు. సరిగ్గా ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న తంతు కూడా అలాగే ఉంది. అటు టాలీవుడ్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్(Allu Arvind) పాత కామెంట్స్, ఇటు కన్నడ రాకింగ్ స్టార్ యశ్ మాతృమూర్తి రీసెంట్ వీడియో.. ఈ రెండింటినీ మిక్స్ చేసి నెటిజన్లు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడిపిస్తున్నారు. అసలు వివాదం వేరు, బయట జరుగుతున్న లొల్లి వేరు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

అసలు కథలోకి వెళితే, రెండేళ్ల క్రితం పెద్ద సినిమాల బడ్జెట్లు, హీరోల రెమ్యునరేషన్ల గురించి జరుగుతున్న ఒక డిస్కషన్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ 'కేజీఎఫ్(KGF)' సినిమాను ఉదాహరణగా వాడారు. సినిమా రేంజ్ ఎలా ఉంటుందో చెబుతూ "కేజీఎఫ్‌కు ముందు యశ్ ఎవరు?" అనే కోణంలో ఒక మాట అన్నారు. అది ఆ సందర్భానికి సంబంధించిన డిబేట్ మాత్రమే. కానీ, ఇప్పుడు 'టాక్సిక్' సినిమా హడావుడి నడుస్తున్న తరుణంలో ఆ పాత వీడియోను బయటకు లాగారు.

దీనికి తోడు, రీసెంట్‌గా యశ్ తల్లి పుష్ప అరుణ్ కుమార్(Pushpa Arun Kumar) మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ క్లిప్ నెట్టింట వైరల్ అయింది. అందులో ఆమె కేజీఎఫ్‌కు ముందే తన కొడుకు కన్నడలో ఎన్నో హిట్లు కొట్టాడని, బస్ డ్రైవర్ కొడుకుగా వచ్చి సొంత కష్టంతో ఎదిగాడని చెప్పుకొచ్చారు. అయితే ఆమె ఎక్కడా అల్లు అరవింద్ పేరు ఎత్తలేదు, ఆయనను ఉద్దేశించి మాట్లాడనూ లేదు. కానీ సోషల్ మీడియా పేజీలు మాత్రం ఈ రెండింటిని కలిపి "యశ్ తల్లి కౌంటర్" అంటూ పెద్ద హెడ్డింగులతో వైరల్ చేయడం మొదలుపెట్టాయి.

ఇక యశ్ విషయానికి వస్తే, ఆయన కూడా ఇటీవలి ప్రమోషన్లలో సినిమా సక్సెస్ అనేది కేవలం హీరో ఒక్కడి వల్ల వచ్చేది కాదని, దర్శకుడు, రచయిత, టెక్నీషియన్లు అందరి కృషితో పాటు ప్రేక్షకుల ఆశీస్సులు ఉంటేనే సాధ్యమని చాలా మెచ్యూర్డ్‌గా స్పందించారు. కానీ ఈ మాటలను కూడా కొందరు కావాలనే అల్లు అరవింద్‌కు యశ్(Yash) ఇస్తున్న కౌంటర్లుగా ప్రచారం చేస్తూ ట్రోలింగ్‌కు తెరతీశారు. నిజానికి ఇటు అల్లు అరవింద్ కానీ, అటు యశ్ కానీ, లేదా యశ్ వాళ్ల అమ్మ కానీ ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా ఎలాంటి విమర్శలు చేసుకోలేదు. ఎవరి దారిలో వాళ్ళు వేరే సందర్భాల్లో మాట్లాడిన మాటలను, సొంత పూతలు పూసి సోషల్ మీడియాలో ఇలా పూనకం వచ్చినట్లు రచ్చ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వివాదం ఒకటైతే, ఆన్‌లైన్ లో నడుస్తున్న లొల్లి మాత్రం మరో లెవెల్‌లో ఉందని సినీ జనాలు నవ్వుకుంటున్నారు.

Tags
Allu Arvind Yash Yash Mother Toxic Movie KGF Tollywood Sandalwood South Cinema
Recent Comments
Leave a Comment

Related News