ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ మరో సరికొత్త మైలురాయికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ కీలక నిర్ణయాలతో దూసుకెళ్తున్న ఆ పార్టీ, ఇప్పుడు నేరుగా యువతను ఆకట్టుకునేందుకు పకడ్బందీ వ్యూహానికి తెరలేపింది. రాబోయే రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని, ఏకంగా 'జెన్‌జీ' (Gen-Z) తరహా యువతను టార్గెట్ చేస్తూ సరికొత్త విభాగానికి శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలోనే పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తన మార్కు పాలిటిక్స్‌తో మరో మాస్టర్ స్ట్రోక్‌కు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కేరళ టూర్‌లో ఉన్న పవన్ కళ్యాణ్, అక్కడి నుంచే ఆన్‌లైన్ వేదికగా ఈ యువజన విభాగాన్ని అట్టహాసంగా ప్రారంభించనున్నారు. ఏకంగా సుదూర ప్రాంతం నుంచి ఆయన ఈ కొత్త అస్త్రం ప్రయోగించనుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం(Pithapuram) నియోజకవర్గంలోనే దీనికి అంకురార్పణ జరుగుతుండటం విశేషం. కేవలం ప్రారంభోత్సవంతో సరిపెట్టకుండా, యువతను ఉత్సాహపరిచేలా ప్రత్యేక గీతం, లోగోతో పాటు రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన విధానాలపై పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
గతంలో 'యువరాజ్యం' రూపంలో యువతను ఒక్కతాటిపైకి తెచ్చిన అనుభవం పవన్ కళ్యాణ్ సొంతం. ఇప్పుడు కాలానికి తగినట్లుగా మారుతున్న ట్రెండ్స్, యువత ఆకాంక్షలను అందిపుచ్చుకునేందుకు ఈ సరికొత్త ప్లాన్ ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సరికొత్త యువసేనతో జనసేన(Janasena) పార్టీ గ్రాఫ్ మరింత పెరగడం ఖాయమని కేడర్ ఫుల్ జోష్‌లో ఉంది.