సజ్జల రామకృష్ణారెడ్డి.. వైసీపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్. ఒకరకంగా చెప్పాలంటే.. జగన్ తర్వాత లేదా.. జగన్ కన్నా ముందు.. అనదగిన నాయకుడిగా ఆయన తన ప్రస్థానాన్ని బల పరుచుకున్నారు. సహజం గానే అధినేతకు చేరువగా ఉండే నాయకుల ప్రాబల్యం ఏ పార్టలో అయినా కనిపిస్తుంది. పైగా.. జగన్‌కు వారసులు అనే మాట ఇంకా వినిపించని నేపథ్యంలో ఆయనను మచ్చిక చేసుకుంటున్నవారిలో గతంలో సాయిరెడ్డి, తర్వాత.. సజ్జల కీలక రోల్ పోషించారన్నది వాస్తవం. అయితే.. సాయిరెడ్డిపై ఎప్పుడూ పార్టీలో అంతర్గత చర్చ సాగలేదు.
సాయిరెడ్డి తమను తొక్కేస్తున్నారని.. కానీ, తమను వేధిస్తున్నారని కానీ.. ఎవరూ చెప్పలేదు. కానీ, సజ్జల వ్యవహారం మాత్రం అటు అధికారంలో ఉన్నా.. ఇటు అధికారం కోల్పోయినా హాట్ టాపిక్‌గానే మారుతోం ది. దీనికి కారణం.. ఆయన తీసుకునే నిర్ణయాన్ని ప్రశ్నించరాదన్న ఏకైక కారణమేనన్నది పార్టీ నాయకు లు చెబుతున్నారు. అంతేకాదు.. ఏదైనా విషయం జగన్‌కు చెప్పాలని వస్తే.. వారిని ముందుగా.. తన వద్ద కు పిలుచుకుని.. ఆయనే ఆ విషయాన్ని విని.. ``ఇక పో..`` అంటూ.. సదరు నేతలకు ఆదేశాలు జారీ చేసే వారని.. గతంలో ఓ మాజీ మంత్రి చెప్పారు.(ఈయన బయటకు వచ్చేశారు)
తాజాగా మరింత..
సజ్జల వ్యవహారంపై తాజాగా సాయిరెడ్డి చేసిన కామెంట్లు.. రాజకీయ వర్గాల్లో కంటే వైసీపీలోనే అంతర్గత చర్చకు దారితీశాయి. సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను మెజారిటీ నాయకులు సమర్థించారు. నిజానికి.. సాయిరెడ్డి చేసిన కామెంట్ల తర్వాత.. వీటిని ఖండిస్తూ.. ప్రెస్‌మీట్లు పెట్టాలని పార్టీ నుంచి సమాచారం బయటకు వచ్చింది. అయితే.. ఎవరూ బయటకు రాలేదు. మరికొందరు.. ఉన్నదే చెప్పారంటూ.. అంతర్గత ఫోన్ సంభాషణల్లోనూ వినిపించారు. దీంతో షాక్‌కు గురైన సజ్జల వెంటనే మీడియా ముందుకు వచ్చారని అంటున్నారు.
ఏం జరుగుతుంది?
సజ్జల వ్యవహారం.. ఆయన ఆధిపత్య అభిజాత్యాలు.. కొనసాగితే.. వచ్చే ఎన్నికల నాటికి సీనియర్లు అన దగిన నాయకులు పక్కకు వెళ్లిపోవడం ఖాయమని అంటున్నారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా మంది ఆయనతో విభేదించి పక్కకు తప్పుకొన్నారు. ఇక, పార్టీలో ఉన్న కీలక నేతల వ్యాఖ్యల ప్రకారం.. సజ్జల వార్డు సభ్యుడిగా కూడా గెలవలేదు. అంతేకాదు.. ఆయనకు ఎక్కడా ప్రజాదరణ కూడా లేదు. ఒక బహిరంగ సభలో ప్రసంగించిన అనుభవం కూడా లేదు. కానీ.. తమపై కెక్కి అధికారం చలాయిస్తున్నారని.. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రులు కూడా వ్యాఖ్యానించడం.. కొసమెరుపు. మొత్తంగా.. సజ్జల వ్యవహారం.. టీకప్పులో తుఫానైతే కాదని.. ఇది పెద్ద విపత్తేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.