తన తండ్రి కేసీఆర్ తో తనకు విభేదాలు రావడానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి కారణమంటూ టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. హరీశ్ రావు, సంతోష్ రావులను భవిష్యత్తులో క్షమించినా...ప్రశాంత్ రెడ్డిని మాత్రం క్షమించబోనని అన్నారు. ఈ క్రమంలోనే కవిత కామెంట్లపై ప్రశాంత్ రెడ్డి స్పందించారు.
కష్టకాలంలో కేసీఆర్ వెంట ఉన్నది ఎవరో కవిత తెలుసుకోవాలని ప్రశాంత్ రెడ్డి అన్నారు. తనపై కవిత చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కవిత చర్యలతో కేసీఆర్ ఎంతటి మనోవేదనకు గురవుతున్నారో ఆలోచించుకోవాలని చెప్పారు. కేసీఆర్-కవితలను కలిపేందుకే తాను ప్రయత్నించానని, విడగొట్టడానికి కాదని స్పష్టం చేశారు. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డితో పాటు తాను కూడా 2001 నుంచి అంటే టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందు నుంచే కేసీఆర్ వెంట ఉన్నామని గుర్తు చేశారు.
బీఆర్‌ఎస్ అంటేనే ప్రశాంత్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి అంటేనే బీఆర్‌ఎస్ అని అన్నారు. కవిత మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. పార్టీ లైన్ దాటినందుకే ఆమెపై చర్యలు తీసుకున్నారని తెలిపారు.
అసెంబ్లీ లోపలా బయటా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిరంతరం పోరాడుతున్నది ఎవరో ప్రజలందరికీ తెలుసన్నారు. తాను కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరపలేదని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధానంలో ప్రమాణపూర్వకంగా చెప్పగలనని, కాంగ్రెస్‌తో కవిత రహస్య మంతనాలు జరపలేదని ఆమె చెప్పగలరా? అని నిలదీశారు.