13 ఏళ్లుగా డాక్టర్ రాజా నా వెన్నంటి ఉన్నారు: లోకేశ్

admin
Published by Admin — September 09, 2026 in Andhra
News Image

మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసులో గ్లోబల్ ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీ సభ్యులతో నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత ఎన్నారైలతో తనకున్న అనుబంధాన్ని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. 2013 నుంచి గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ డాక్టర్ గురు రాజాతో తనకు అనుబంధం ఉందని, 13 సంవత్సరాలుగా ఆయన తనకు ఎంతో మద్దతుగా నిలిచారని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. తనపై డాక్టర్ రాజాకు అపారమైన నమ్మకం ఉందని, తనను ఎవరూ నమ్మని రోజుల్లో ఆయన తన వెన్ను తట్టి ప్రోత్సహించారని గుర్తు చేసుకున్నారు. ఈ రోజు డాక్టర్ రాజా గ్లోబల్ ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేశారని, ఆయనతో పాటు కమిటీ సభ్యులందరినీ అభినందిస్తున్నానని చెప్పారు.

ఇక, తెలుగు వారు అమెరికా చూసే ముందే ఆయన అమెరికా వెళ్లారని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాంపై ప్రశంసలు కురిపించారు లోకేశ్. టీడీపీ ఎన్నారై విభాగాన్ని చాలాకాలంపాటు సమర్ధవంతంగా నడిపించిన సీనియర్ నాయకుడు కోమటి జయరాం అని కొనియాడారు. అమెరికాలో తెలుగువారి సమస్యలు పరిష్కరిస్తూ, వారికి చేదోడువాదోడుగా ఉన్నారని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎంతో కాలంగా కోమటి జయరాం అండగా ఉన్నారని చెప్పారు.

ప్రపంచంలో తెలుగు వారు లేని దేశం లేదని...ఏ దేశానికెళ్ళినా..గట్టిగా తెలుగులో మాట్లాడితే 20 మంది తెలుగు వారు వస్తారని అన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ ఆఖరి వారం తమ కుటుంబ సభ్యులంతా విదేశాలకు వెళతామని, అక్కడ కూడా మారు మూల ప్రాంతాలకు వెళతామని, అయినా సరే అక్కడ కూడా తెలుగు వారు కనిపిస్తుంటారని హర్షం వ్యక్తం చేశారు. -30 డిగ్రీల చలి ఉన్న ప్రాంతాల్లో కూడా తెలుగు ప్రజలు సెటిల్ అయ్యారని, అది తెలుగు ప్రజల గొప్పదనం అని కొనియాడారు.

విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావు రాజకీయాల్లోకి అడుగుపెట్టినపుడు రూపొందించిన సంస్కరణలు మనందరం ముందుకు తీసుకువెళుతున్నామని చెప్పారు. 1982లో డాక్టర్లు, ఇంజనీర్లు, విద్యావంతులకు..కొత్త వారికి, యువకులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత అన్న ఎన్టీఆర్ దని చెప్పారు.

2019-24 మధ్యకాలంలో గొడ్డలి పార్టీ వల్ల మనందరం, తెలుగు ప్రజలందరం ఇబ్బంది పడ్డామని, అమరావతి వర్సెస్ మూడు ముక్కలాట అన్న రీతిలో జరిగిన అమరావతి రైతుల పోరాటానికి ఎన్నారైలు మద్దతునిచ్చారని ప్రశంసించారు. డబ్బులు సేకరించి న్యాయపోరాటం చేశారని, గత ప్రభుత్వ వైఫల్యాలను, తప్పులను సోషల్ మీడియాల ద్వారా కడిగేసింది ఎన్నారైలని పొగడ్తలతో ముంచెత్తారు. కేసులు పెట్టినా భయపడలేదని, లుక్ ఔట్ నోటీసులిచ్చినా బెదరలేదని అన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతోందని పోరాడారని, చంద్రబాబును అర్ధరాత్రి అరెస్టు చేస్తే 50 దేశాల్లో 200 పట్లణాల్లో ఎన్నారై టీడీపీ నేతలు ఆందోళన చేశారని చెప్పారు.

అది చిన్న కార్యక్రమం కాదని, తమకు కొండంత ధైర్యం ఇచ్చిన కార్యక్రమమని గుర్తు చేసుకున్నారు. గత ఎన్నికల్లో 1000 నుంచి 5000 డాలర్లు ఖర్చు పెట్టి మరీ కూటమి పార్టీల అభ్యర్థులకు ఓటు వేసేందుకు ఎన్నారైలు వచ్చారని అభినందించారు. కొందరు నెల..మరికొందరు 6 నెలలు...12 నెలలు లాంగ్ లీవ్ పెట్టి ప్రజల్లో చైతన్యం తెచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. 2024లో ప్రజా ప్రభుత్వ ఏర్పాటులో ఎన్నారైలు తమవంతు కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు.

మీరు ఎన్నారైలు కాదు..ఎమ్మారైలు...మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్ అని పొగడ్తలతో ముంచెత్తారు లోకేశ్. ఎన్నారైలందరికీ అబ్దుతమైన ఉద్యోగాలున్నాయని, విదేశాల్లో స్థిరపడ్డారని, మంచి ఇల్లు ఉందని, కష్టపడాల్సిన పని లేదని, కానీ, తెలుగు జాతి కోసం ..తమ రాష్ట్రం కోసం...ఇదంతా చేస్తున్నారని కొనియాడారు. ఎన్నారైల పిల్లలు తనకన్నా తెలుగు బాగా మాట్లాడుతున్నారని, తెలుగుతనం మరవకుండా పిల్లలకు నేర్పిస్తున్నారని ప్రశంసించారు.

ఎన్నారైలందరికీ సేవా భావం ఉందని, తాము చదువుకున్న పాఠశాలలకు కోట్లు ఖర్చుపెట్టారని గుర్తు చేసుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా...తెలుగు జాతి గురించి ఆలోచించే పార్టీ టీడీపీ అని అన్నారు.

ఎన్నారైలు తెలుగు జాతికి బ్రాండ్ అంబాసిడర్లని, కులం మతం జాతి అని చూడకుండా తెలుగు జాతి నంబర్ వన్ చేసే బాధ్యత అందరం తీసుకుందామని పిలుపునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలు నంబర్ వన్ గా ఉండాలని ఆకాంక్షించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ గురించి మాట్లాడాలని, ఏపీకి పెట్టుబడులు తీసుకురావాలని ఎన్నారైలకు దిశానిర్దేశం చేశారు.

భారత్ లో 100 రూపాయలు పెట్టుబడి పెడితే అందులో 25 రూపాయలు ఏపీలో అని అన్నారు. గూగుల్, ఆర్సెనల్ మిట్టల్, ఫైటర్ జెట్ల తయారీ యూనిట్లు ఏపీకి వచ్చాయని చెప్పారు. ఎన్నారైలకు, గ్లోబల్ ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ సభ్యులందరికీ అభినందనలు, ధన్యవాదాలు చెప్పారు లోకేశ్. వారి కృషి తమను ఈ స్థానంలో కూర్చోబెట్టింది అని లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. గ్రూపు రాజకీయాలకు దూరంగా ఉండాలని, మనందరిదీ ఒకే గ్రూప్..టీడీపీ గ్రూప్ అని లోకేశ్ హితవు పలికారు.

మై టీడీపీ యాప్ లో రిజిస్టర్ కావాలని, అందులో ఎన్నారైలు చేస్తున్న కార్యక్రమాలకు గుర్తింపు ఉంటుందని, రివార్డులు కూడా ఉంటాయని అన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో ఈ యాప్ లేదని, కార్యకర్తలు చేస్తున్న పనులను గుర్తిస్తున్నామని చెప్పారు. ఎవరి రికమెండేషన్ లేకుండా...మై టీడీపీ యాప్ లో తమ పనితీరుతో గుర్తింపు తెచ్చుకున్న వారకి నామినేటెడ్ పదవులిస్తున్నామని అన్నారు. ఎన్నారైలు కూడా తాము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని మై టీడీపీ యాప్ ద్వారా తెలియజేయాలని కోరారు.

‘‘డాక్టర్ రాజాపై బాధ్యత పెరిగింది, ఇన్నాళ్లు ఆయన తనకు స్కోర్ వేశారు... ఇప్పుడు ఆయనకు నేను స్కోర్ వేస్తాను...ఏ దేశంలో ఏ పట్టణంలో అయినా..10 మంది తెలుగు వారుంటే అక్కడ ఎన్నారై టీడీపీ కమిటీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత డాక్టర్ రాజాపై ఉంది...అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది... తెలుగు ప్రజల కోసం నిరంతరం కష్టపడాలి..అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానం కోసం పోరాడాలి..పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం చేయాలి.....తు.చ తప్పకుండా కార్యక్రమాలను అమలు చేయాలని ఎన్నారైలను కోరుతున్నా... 30 రోజుల్లో కమిటీలు పూర్తి చేయాలి..పెండింగ్ ఉండకూడదు ...2024కు ముందు చాలామంది ఎన్నారైలు పార్టీ కోసం కష్టపడ్డారు...వారిని గుర్తించండి..’’ అని లోకేశ్ అన్నారు.

‘‘మూడేళ్ల క్రితం 300 కోట్ల స్కాం అని చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టారు..ఏం చూపించలేకపోయారు..చివరకు చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చారు...కానీ, 53 రోజలు ఏం తప్పు చేయకుండా చంద్రబాబును కోర్టులో ఇలా కూర్చోబెట్టారు...రాజమండ్రి జైల్లో బంధించారు...అయినా పోరాడాం...పగలు భారత్ లో ...రాత్రి విదేశాల్లో ఐ యామ్ విత్ సీబీఎన్ అని నిరసనలు తెలిపాం...’’ అని లోకేశ్ ఆ రోజులు గుర్తు చేసుకున్నారు.

‘‘ఈ రోజు రాత్రి మీ ఇంట్లో...మీ ప్రాంతంలో క్యాండిల్స్ వెలిగించండి...కుదిరితే 53 క్యాండిల్స్ వెలిగించండి...చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను గుర్తు చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది...చంద్రబాబు ఎెప్పుడూ తెలుగు జాతి నంబర్ వన్ గా ఉండాలి అని ఆలోచించారు...ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలపై ఉంది...ఎప్పుడూ జరగని విధంగా గ్లోబల్ ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది.....అందరూ కలిసి కష్టపడి పోరాడదాం...తిరిగి 2029లో ఎన్డీఏను గెలిపించాల్సిన బాధ్యత మన అందరిదీ’’ అని లోకేశ్ అన్నారు.

News Image
News Image
News Image
Tags
Minister lokesh shared bonding with global NRI TDP chief Doctor Raja NRI TDP central committee Swear in ceremony
Recent Comments
Leave a Comment

Related News